ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు.
ఏలూరు, మే, 9 : ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, ఆయుష్మాన్ భారత్ విభాగం వద్ద, సాంఘిక సంక్షేమ వసతి గృహాల సముదాయాల వద్ద ప్రభుత్వ వైద్యకళాశాల భవనాల నిర్మాణ పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డా. నరసింహం, అసిస్టెంట్ సంచాలకులు వెంకటేష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), వివిధ శాఖల అధికారులతో కృష్ణబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ కృష్ణబాబు మాట్లాడుతూ రానున్న రోజులలో వైద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, వివిధ వైద్య విభాగాలలో స్పెషలిస్ట్ కోర్స్ లు 750 మంది పైగా విద్యార్థినీ విద్యార్థులు అభ్యసిస్తారని, ఆ సామర్ధ్యానికి తగిన విధంగాప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు వెంటనే పంపాలన్నారు. వసతిగృహ భవనాలు వైద్యకళాశాలకు దగ్గరలో ఉండేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్స్ నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం వివరాలను అధికారులు స్పెషల్ సీఎస్ కు వివరించారు. అనంతరం ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను కృష్ణబాబు స్వయంగా పరిశీలించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలిని, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఎస్సి కార్పొరేషన్ ఈడి ముక్కంటి, వైద్యారోగ్య శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్, ఎస్ఈ బలరాంరెడ్డి, ఈఈ రాజబాబు, ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.