ఏలూరు, అక్టోబర్, 27 : ఏలూరు జిలాల్లో 27 తుఫాన్ సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ఏలూరు, అక్టోబర్, 27 : ఏలూరు జిలాల్లో 27 తుఫాన్ సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఏలూరు జిల్లాలో తుఫాన్ సహాయక చర్యలను గురించి మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మొంథా తుఫాను ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దమైనదన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అందరూ వారికి కేటాయించిన విధులలో నిమగ్నమయ్యారని, జిల్లాలో ఇంతవరకు 27 తుఫాన్ సహాయక కేంద్రాలు ఏర్పాటుచేసి, 534 మంది ప్రజలను తరలించడం జరిగిందన్నారు. జిల్లాలోని 408 గ్రామ/వార్డ్ సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నారని, దానిని అనుసరించి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు తీసుకుంటున్నదన్నారు. వాగులు, చెరువులు, మైనర్ ఇరిగేషన్ చెరువులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిలాల్లోని 1123 రేషన్ షాపులున్నాయని, వాటిలో 583 రేషన్ షాపులలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలను సిద్ధం చేశామన్నారు. మిగిలిన రేషన్ షాపులలో రేపు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. అన్ని రేషన్ షాపులలో 20 శాతం అదనంగా సరుకులను బఫర్ స్టాక్ గా ఉంచుతామన్నారు. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఎటువంటి అధైర్యపడొద్దన్నారు. గత సంవత్సరం సేకరించినవిధంగానే ధాన్యం సేకరణ చేస్తామన్నారు. జిల్లాలోని 234 రైతు సేవా కేంద్రాలున్నాయని, వాటిలో 30 చొప్పున జిల్లాలో టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం సాయంత్రానికి జిల్లాలో 25. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, మంగళవారం మధ్యాహ్నం నుండి తుఫాన్ తీవ్రత పెరుగుతుందన్నారు. జిల్లాలోని కలెక్టరేట్, అన్ని మండల కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కరించడం జరుగుతుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుండి తీవ్రమైన గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దన్నారు. కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు మండలంలో తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ఆయా ప్రాంతాలలో సమస్యాత్మకమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్ పనుల పునరుద్దరణకు గాను 2 వేల విద్యుత్ స్థంబాలు, 500 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచామన్నారు. సమాచార వ్యవస్థకు అంతరాయం లేకుండా సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్ లు ఏర్పాటుచేయాలని, వాటికి అవసరమైన డీజిల్ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.