ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని నగరపాలక, పురపాలక సంఘాలలోని ప్రజలకు ప్రాధమిక మౌలిక సదుపాయాల కల్పనకు 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.
ఏలూరు, జూలై , 4 : ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని నగరపాలక, పురపాలక సంఘాలలోని ప్రజలకు ప్రాధమిక మౌలిక సదుపాయాల కల్పనకు 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. స్థానిక ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు హాలులో శనివారం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మేయర్ షేక్ నూర్జహాన్ జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ లతో కలిసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పురపాలక సంఘాలలోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పనిచేయాలన్నారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 15 నియోజకవర్గాలలోని 10 పురపాలక సంఘాలున్నాయన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, ఆకివీడు, నర్సాపురం, తిరువూరు మునిసిపాలిటీలు ఉన్నాయన్నారు. వీటిల్లో ప్రతీ ఇంటికి త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు, పార్కులు వంటి ప్రాధమిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నామని, త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భవనాలు, లేఔట్ అనుమతుల మంజూరులో క్లిష్టతను తొలగించి త్వరితగతిన అనుమతులు మంజూరుకు పలు సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. పలు రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి అనుమతుల మంజూరును రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళీకృతం చేసిందన్నారు. నగరపాలక సంస్థ, పట్టణాల పరిధిలో భవనాల నిర్మాణానికి, లేఔట్ లకు నిబంధనలను పరిశీలించి అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవనాలు, లేఔట్ అనుమతుల మంజూరులో ఆస్థి పన్నుల లెక్కింపులో నిబంధనలు తప్పనిసరిగా పాటించి పన్నులు విధించాలన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని, నగర, పట్టణ పరిధిలో పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండాలని, రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా చూడాలన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యుత్ వాహనాలను ఉపయోగించాలని, పురపాలక సంఘాలకు వారికి అవసరమైన వాహనాలపై ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. నగరపాలక, పురపాలక సంఘాలు పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, పన్నుల వసూళ్లను నూరుశాతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పలు పట్టణాలలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలను పూర్తిచేసే దిశగా మునిసిపల్ కమిషనర్లు పనిచేయాలన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ ఏలూరు నగరంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు.
అనంతరం మంత్రి నారాయణను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మేయర్ షేక్ నూర్జహాన్, దుశ్శాలువా ఘనంగా సత్కరించి, వేంకటేశ్వరస్వామి స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.
పురపాలక శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం. ప్రభాకరరావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అదనపు డైరెక్టర్ నాగ నరసింహారావు, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణిశివప్రసాదు, ఏయంసి ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు యస్.యం.ఆర్. పెదబాబు, చోడే వెంకటరత్నం, ఇడా పరిధిలోని పురపాలక సంఘాల కమిషనర్లు, వివిధ కార్పొరేటర్లు, మెప్మా పిడి యం.రాజబాబు, నగర పాలక సంస్థ ఇంజనీరింగు అధికారులు, ప్రభృతులు ఉన్నారు.