ఏలూరు కలెక్టరేట్ లో సోమవారం సాయంత్రం వరకు కొనసాగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఏలూరు, జనవరి, 6: ఏలూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం సాయంత్రం వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మరియు వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ వద్ద తనని కలిసి విజ్ఞప్తులను అందించిన ప్రజల నుండి కూడా వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో వివిధ పోస్టులకు సంబంధించి ఖాళీలు భర్తీ చేయాలనీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంనకు చెందిన మెట్టు జయశ్రీ తన భూమికి సంబంధించి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరగా దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. వీరితోపాటు పలువురు ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్ వెట్రిసెల్వి కి వినతి పత్రాలు సమర్పించారు.