Close

ఏలూరు జిల్లాలో ‘మొంథా తుఫాన్’ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలిపారు. మొంథా తుఫాన్ అప్రమత్తతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్

Publish Date : 25/10/2025

ఏలూరు, అక్టోబర్, 25 : ఏలూరు జిల్లాలో ‘మొంథా తుఫాన్’ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలిపారు. మొంథా తుఫాన్ అప్రమత్తతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ‘మొంథా తుఫాన్’ కారణంగా తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, మండల, గ్రామ స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. తీవ్రగాలులకు హోర్డింగ్ వంటి కట్టడాల వల్ల ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నామని, మొబైల్ టవర్లు నిరంతరం పనిచేసేలా జనరేటర్ లు ఏర్పాటుచేయాలని టెలికాం కంపీనీల వారిని ఆదేశించడం జరిగిందన్నారు. ఈనెల 30వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.