ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ కారణంగా 72 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది కేంద్ర బృందం నష్టాలను పరిశీలించింది- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఉంగుటూరు/ఏలూరు, నవంబర్, 10 : మోంథా తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో 72 కోట్ల రూపాయల విలువైన పంట నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఉంగుటూరు మండలం నారాయణపురం లో తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం పంట నష్టాలను పరిశీలించిన అనంతరం వివరాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తనను కలిసిన పాత్రికేయులకు తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 5703 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని, అధిక శాతం ధాన్యం పంట దెబ్బతిందన్నారు. 17. 60 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, బొప్పాయి, అరటి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా జిల్లాలో తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. 19 ఇళ్ళు దెబ్బతిన్నాయని, ఒక గేదె , 4 గొర్రెలు మరణించాయన్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే 3422 మంది ప్రజలను తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. తుఫాన్ అనంతరం పునరావాస కేంద్రాల నుండి వెళ్లే ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు, కుటుంబానికి 3 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించామన్నారు. జిల్లాలో పంట నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం నియమించిన పరిశీలనా బృందం ఉంగుటూరు మండలంలోని నారాయణపురం దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిందని, జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన వివిధ నష్టాలపై జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను, కుళ్ళిన వరిదుబ్బులు, దెబ్బతిన్న ఉద్యానవన పంటలను బృందం సభ్యులు పరిశీలించారన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ప్రభృతులు పాల్గొన్నారు.