Close

ఏలూరు జిల్లాలో వాల్మీకి మహర్షి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

Publish Date : 07/10/2025

ఏలూరు,అక్టోబరు 07: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ముఖ్యఅతిథిగా పాల్గొని, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, మహర్షి వాల్మీకి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు
కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ నేడు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను మనం రాష్ట్ర పండుగగా రాష్ట్రం అంతా ఘనంగా జరుపు కుంటున్నారని, రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి అని అన్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించడం ద్వారా సీతారాములు సద్గుణాలను, గొప్పదనాన్ని చెప్పడంతో పాటు ఆదర్శవంతమైన జీవితం, కుటుంబవిలువలు నుంచి పాలనా సూత్రాలు వరకు నేటితరం నుండి రాబోయే అన్నితరాలు వారికి ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. సమాజ శ్రేయస్సుకు అవసరమైన ఎన్నో జీవన సూత్రాలను తెలియచేసిన వాల్మీకి మహర్షికి మనమందరం జన్మజన్మలు రుణపడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రామాయణం సామాజిక నీతిని బోధిస్తుందని, వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో ఏడు కాండములుతో మానవాళికి అద్భుతమైన రామాయణం కావ్యాన్ని అందిచారని అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని వాల్మీకి జీవిత చరిత్ర మనవందరికీ తెలియ చేస్తుందన్నారు.మహానీయులు వాల్మీకి జీవితాన్ని మనమంతా ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడిచి తమజీవిత లక్ష్యాలను ఉన్నతంగా తీర్చిదిద్దు కోవాలన్నారు. మొట్టమొదటి శ్లోకం మనకు అందించిన మహానీయుడు మనమహర్షి వాల్మీకి అని కొనియాడారు. వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దైనందిన జీవితంలో స్పూర్తితో జీవించాలని అన్నారు. వేల సంవత్సరాలు క్రితమే జ్ఞానం సంపాదించారని, జ్ఞానం ఒకరి సొత్తు కాదని అన్నారు. కృషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమే అని, అది బోయ వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో నిరూపితమైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి టి.వెంకటేశ్వర రావు, బిసి కార్పొరేషన్ ఇడి పుష్పలత, జిల్లా కలెక్టరేటు, బిసి కార్పొరేషన్, వివిధ శాఖలు ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .