ఏలూరు నగరంలోని తమ్మిలేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ

ఏలూరు, సెప్టెంబర్ 2: తమ్మిలేరు వరద దృష్ట్యా ఏలూరు రూరల్ ,అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ,జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ లు ఇతర సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. నగరంలోని తమ్మిలేరు నదీపరివాహక ప్రాంతమైన శనివారపుపేట కాజ్ వే, బాలయోగి వంతెన, తంగెళ్ళమూడి. వంతెన తదితర ప్రాంతాల్లో పర్యటించారు.తమ్మిలేరు వరద మూలంగా సంబంధిత పరివాహక ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన చర్యలు, తమ్మిలేరు వెంట ఉన్న గట్టుల యొక్క పటిష్టతను గురించి క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను వారు ప్రత్యక్షంగా తెలుసుకొనీ అధికారులకు పలు ఆదేశాలు సూచనలను జారీచేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు, ఎర్రకాల్వ, గోదావరి తీర ప్రాంతాలకు, కొల్లేరు వరద ప్రభావానికి గురయ్యాయని, వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాలో గత మూడు రోజుల నుండి 89 మిల్లీమీటర్ల వర్షం కారణంగా నాగిరెడ్డిగూడెం వద్ద నీటిని విడుదల చేయడంతో తమ్మిలేరు పొంగి ప్రవహిస్తున్నదన్నారు. జిల్లాలో తమ్మిలేరు వరద కారణంగా చింతలపూడి, లింగపాలెం,పెదవేగి, చాట్రాయి, ముసునూరు మండలాలలోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఎర్రకాల్వ వరద కారణంగా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం లో వరద పరిస్థితులు ఉంటాయన్నారు. జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాలలో లైఫ్ జాకెట్లు, రోప్ లు వంటివి సిద్ధం చేయడం జరిగిందని, ప్రజలెవ్వరూ వరద ఉధృతి పరిస్థితులకు వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొల్లేరు లంక గ్రామాలలో బోట్లలో ప్రయాణించవద్దని, ఈ విషయాన్నీ ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు టాంటాం ద్వారా తెలియజేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరి, తగ్గుముఖం పట్టి, ప్రస్తుతం 41 అడుగుల వద్ద ఉందన్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వరద పరిస్థితులు తగ్గుముఖం పెట్టేవరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంతో ఉండాలని కలెక్టర్ చెప్పారు. గతం లాగా వరద వస్తే అందుకు తగిన విధంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. గట్ల పటిష్టతను పరిశీలించి బలహీనమైన చోట్ల అవసరమైన ఇసుక బస్తాలు, తదితర సామాగ్రితో పటిష్టం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితిలో ఎక్కడైనా వరద ప్రవాహానికి గండి కొట్టవలసిన పరిస్థితి ఉంటే అందుకు అవసరమైన ప్రోక్లైనర్ ముందుగానే అందుబాటు లోకి తెచ్చుకోవాలని, ముంపు ప్రమాదం ఏర్పడే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. .అదేవిధంగా ఆటో ద్వారా మైక్ ద్వారా కూడా సమాచారం ముందుగానే తెలియజేయాలన్నారు. గతంలో తమ్మిలేరు వరదలను దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలని తెలిపారు. తమ్మిలేరు రిజర్వాయర్ లో నీటిసామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తమ్మిలేరు కాలువకు సంబంధించి ఏలూరులో నాలుగు పాయింట్లు వద్ద సంబంధిత అధికారులు 24 గంటలు పర్యవేక్షణలో ఉండి, ప్రజలెవ్వరూ వరదనీటిలో దాటకుండా చూడాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందుగానే హెచ్చరికలను జారీచేయవల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.ఇరిగేషన్ ఇంజనీర్లు తో పాటు నగరపాలక సంస్థ ఇంజనీర్లను ఆయా 4 పాయింట్లు లో సిబ్బందిని పర్యవేక్షణకు ఉంచాలన్నారు. సంబంధిత అధికారులు పేర్లు,ఫోన్ నెంబర్ల తో సహా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. వరద ప్రభావం దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ కెపీఎస్ కిషోర్ మాట్లాడుతూ నాగిరెడ్డి గూడెం వద్ద తమ్మిలేరు వరద నీటి విడుదల ఎపటికప్పుడు రెవెన్యూ పోలీసు అధికారులతో పాటు ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. అదేసమయంలో ఆటో ద్వారా మైక్ లో వరద ప్రమాద హెచ్చరికలను ఆయా ప్రాంత వాసులకు తెలీజేయాలన్నారు.తమ్మిలేరు వరదకు సంబంధించి గతంలో సంభవించిన వరదలు, నీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు గండ్లు ఏ ప్రాంతంలో చేసింది తదితర వివరాలను ఆయన ఆరా తీశారు.
వీరి వెంట ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, డిఎస్పీ శ్రవణకుమార్,ఇరిగేషన్ ఎస్ఈ సి హెచ్ దేవప్రకాష్,,నగరపాలక సంస్ధ కమీషనరు భానుప్రతాప్, ఏలూరు తహశీల్దారు గాయత్రి తదితరులున్నారు