కాలుష్యరహిత నగరంగా ఏలూరు ను తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, నవంబర్, 27 : వాయుకాలుష్య నియంత్రించేందుకు ఎలక్ట్రిక్, సి. ఎన్ .జి. వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించి, వాటి వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రాం కింద కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వాయుకాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నానాటికీ పెరుగుతూ ప్రజారోగ్యానికి చేటు చేస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని వాయుకాలుష్యం కలిగిన నగరాలలో కాలుష్య నియంత్రణకు ప్రణాళికబద్దముగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. . వాటిలో ఏలూరు నగరం ఒకటని, ఏలూరు వంటి చిన్న స్థాయి నగరంలో వాయు కాలుష్యం వ్యాపించడంపై మూలకారణాలు తెలుసుకుని, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలుష్యాలు ప్రజారోగ్యానికి ఏ విధంగా చేటు చేస్తాయన్న విషయం, కాలుష్య నియంత్రణకు ఎలెక్ట్రిక్ వాహనాలు, సి. ఎన్ .జి వాహనాల వినియోగంపై ప్రజలకు అవగాహన పెంచి, ఎలెక్ట్రిక్, సి. ఎన్ .జి వాహనాల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలెక్ట్రిక్ వాహనాలు, సి. ఎన్ .జి వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణకు ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్దఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఏలూరు నగరంలో రహదారులు అంచులలో రోడ్ల నిర్మాణం లేని కారణంగా దుమ్ము, దూళికణాల ద్వారా వాయు కాలుష్యం వ్యాపిస్తున్నదని, దీనిని నివారించడానికి నగరంలోని రోడ్లు మార్జిన్లలో ఎండ్ టూ ఎండ్ వరకు రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నగరపాలక సంస్థ కమీషనర్ ని ఆదేశించారు. ఏలూరు నగరంలో చెత్త సేకరించే వాహనాలను ఎలెక్ట్రిక్ లేదా సి. ఎన్ .జి. వాహనాలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం దేశంలో సగటున వాయుకాలుష్యం 60 యూజీ లు కాగా, ఏలూరు నగరంలో ప్రస్తుతం 63 యుజి లు ఉన్నదని, దానిని 60 యుజి ల కన్నా తక్కువ స్థాయికి తీసుకువచ్చి, ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్ లలో కల్తీ కారణంగా కూడా వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, పెట్రోల్, డీజిల్ కల్తీ జరగకుండా పౌర సరఫరాల అధికారులు గట్టి నిఘా పెట్టాలన్నారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగిన సమయంలో వాహనాల ఇంజిన్ లు ఆపుచేయకుండా ఆన్ లో ఉంచడం, కొంతమంది వాహనాలకు సైలెన్సర్లు లేకుండా నడపడం కారణంగా కూడా కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా విడుదల అయ్యి వాయు కాలుష్యానికి కారణాలు అవుతాయన్నారు. వీటిని నియంత్రించేందుకు సమీకృత ట్రాఫిక్ పర్యవేక్షణ విధానం ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఎస్పీ శ్రావణ్ కుమార్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. వెంకటేశ్వరరావు, కన్సల్టెంట్ ఏ . కోమలి, సామజిక వన విభాగం జిల్లా అటవీ శాఖాధికారి సిహెచ్. సూర్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. సత్యనారాయణరాజు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు,, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భాను ప్రతాప్, ఉప రవాణా కమీషనర్ షేక్ కరీం , వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి. శైలజ, రహదారులు భవనాల శాఖ ఈ ఈ కిషోర్ బాబూజీ, ప్రభృతులు పాల్గొన్నారు.