గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కె.ఆర్.పురం ఐటిడిఏ ను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,జనవరి,30: గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్యం ,ఇతర మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో కె.ఆర్.పురం ఐటిడిఏ పరిధిలో విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆమెమాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శ ఐటిడిఏగా కె.ఆర్.పురం ఐటిడిఏ ను నిలిపే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో సమీష్టి కృషి చేయాలన్నారు. ఐటిడిఏ పరిధిలో విద్యుత్ సౌకర్యం లేని ఏఒక్క గిరిజన గ్రామం ఉండకూడదన్నారు. గిరిజన ప్రాంతంలో రోడ్డు కనెక్టవిటి, టెలిఫోన్ కనెక్టవిటీ, అంతర్గత రహదారులు, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి పర్చాలన్నారు. సమావేశంలో పీసా గ్రామ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.
పదోతరగతి విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించండి..
కేవలం గురుకుల, ఆశ్రమ పాఠశాలలే కాకుండా గిరిజన ప్రాంతంలోని అన్ని విద్యాసంస్ధల్లో విద్యార్ధుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలన్నారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ధృక్పధంతో కృషిచేయాలన్నారు. గతం కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. తరగతి గదుల్లో పాఠాలు భోదిస్తునే, వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్ధులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గిరిజన ప్రాంతాల్లో వైద్యంపై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మాతా శిశు మరణాలు నిర్మూలనకు కృషిచేయాలన్నారు. గర్భిణీలు, బాలింతల విషయాల్లో దృష్టి పెట్టాలన్నారు. నెలలు నిండిన గర్భీణీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఐరిస్క్ కలిగిన గర్భిణీలకు సురక్షిత ప్రసవాలు జరిగేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇందుకోసం ముందస్తుగా వారిని గుర్తించి సంబంధిత యాప్ లో నమోదు చేయాలన్నారు. శిశువులకు నూరుశాతం అవసరమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో 28 రోజుల నుండి 2 సంవత్సరాల లోపు శిశువుల మరణాలకు సంబంధించి బాలురు, బాలికల విడి విడిగా నివేదికను అందజేయాలన్నారు. ఐటిడిఏ పరిధిలో 104,108 తల్లీ,బిడ్డ సేవలను సమీక్షించారు. అదే విధంగా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ ఫాక్స్, వంటి వ్యాధుల నిర్మూలనపై చేపట్టిన చర్యలపై సమీక్షించారు. హిమోగ్లోబిన్ పరీక్షల్లో సికిల్ సెల్ ఎనీమియా పాజిటివ్ వారిని గుర్తించేందుకు అవసరమైన పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలి..
మన గిరిజన ప్రాంతం అంతా మారుమూల ప్రాంతం కాదని ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఎంతో పరిధి ఉందన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని గిరిజన ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రానున్న నూరు రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు.
ఆదిశగా ప్రగతిచూపించాలన్నారు.
అంగన్వాడీ భవనాల నిర్మాణం, పలు రహదారుల ఏర్పాట్లు, మల్టీపర్పస్ సెంటర్లు నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాలతో
పాటు ఇళ్లకు సంబంధించిన ప్రగతిని చూపించి త్వరితగతిన నిర్మాణాలు జరిగేలా
చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో విటిజిఎస్ ద్వారా అడ్డాకుల తయారీ, వేరుశెనగ, జీడిపప్పు, చాక్ లెట్ తయారీ తదితర అంశాలపై శ్రద్ధ చూపించాలన్నారు. త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, ఏపివో పి.వి.ఎస్. నాయుడు, ట్రైబుల్ వెల్పేర్ ఇఇ లత, ట్రైబుల్ వెల్పేర్ ఎస్డిసి ఐ. కిషోర్, పంచాయితీరాజ్ ఇఇ కె. శ్రీను, ఇన్ చార్జి డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. సురేష్, ఐసిడిఎస్, హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.