చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జెసి పి. ధాత్రిరెడ్డి..
ఏలూరు, నవంబర్, 26: జిల్లాలో ప్రజా పంపిణీకి సంబంధించి ప్రతినెలా 10వ తేదీ లోపు ఖచ్చితంగా అర్హులైన వారి ఇంటింటికి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని యండియు ఆపరేటర్లును జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. పిడిఎస్ బియ్యం తో పాటుగా తప్పనిసరిగా కందిపప్పు , పంచదార కూడా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లాలోని పౌర సరఫరాల డిప్యుటీ తహశీల్దార్లు, చౌకధరల దుకాణాల డీలర్లు, యం.డి.యు ఆపరేటర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ చార్జిలు, ఎల్ పిజి గ్యాస్ డీలర్లు, సేల్స్ ఆఫీసుర్లు, జిల్లా పౌరసరఫరాల కార్యాలయపు సిబ్బందితో సమన్వయ సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల డీలర్లు, పిడిఎస్ కు సంబంధించి నిత్యావసర వస్తువులు విషయమై డిడిలు సకాలంలో కట్టాలని ఆదేశించారు. అలా కాని పక్షంలో సంబంధిత వారిపై తగు చర్యలు తీసికోబడతాయని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి అన్ని కార్యకలాపాలు సజావుగా, సక్రమంగా, జాప్యం లేకుండా పౌర సరఫరాల డిటి నుండి అన్నిస్ధాయిలో అధికారులు, సిబ్బంది తగు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలోని ఎల్ పిజి గ్యాస్ డీలర్లు, సేల్స్ ఆఫీసర్లతో జాయింట్ కలెక్టర్ దీపం-2 పధకం అమలు తీరుపై సమీక్షించారు. దీపం-2 పధకం క్రింద లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీలో ఏమైనా సమస్యలు ఎదురైతే డోర్ టు డోర్ వెళ్లి ఈకెవైసి చేయించి సదరు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన లబ్దిదారులకు దీపం-2 పధకంపై ఏమైనా అనుమానాలు ఉన్నచో వాటిని సదరు డీలర్లు నివృత్తి చేయాలన్నారు. దీపం-2 పధకం సబ్సిడి/రాయితీ సొమ్ము లబ్దిదారుల యొక్క బ్యాంకు ఖాతా నెంబరుకు జమ కానిచో, సదరు సబ్సిడీ/రాయితీ సొమ్ము ఎందుకు జమ కాలేదో విచారణ చేసి వారి యొక్క వివరాలను మరోసారి సరిచూసి సదరు సమస్యను పరిష్కరించాలన్నారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.ఎస్.ఎస్. రాజు, జిల్లాలోని పౌర సరఫరాల డిటి లు, చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.