జనగణన పురోగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్
ఏలూరు, జూన్, 1 : జిల్లాలో జనగణన కార్యక్రమంను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రగతిపై సోమవారం సాయంత్రం తహసీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫెరెన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బముగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం జనాభా సంఖ్య పెరగాలని, కానీ కొన్ని ప్రాంతాలలో 2011 జనాభా కన్నా తక్కువగా ఉన్నట్లు సర్వే లో గుర్తించామన్నారు. 2011 జనాభా లెక్కలతో ప్రస్తుత గణగణన వివరాలను పోల్చి ఎప్పటికన్నా తక్కువ జనాభా గుర్తించిన ప్రాంతాలపై అందుకుగల కారణాలను లోతుగా విశ్లేషించి, జనన, మరణ వివరాలు, రేషన్ కార్డులు, పెన్షన్ దారులు, తదితర వివరాలను పరిశీలించి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
జనగణన ను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయవలసిన బాధ్యత తహసీల్దార్లదేనాని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శాశ్వత వలసదారులు సక్రమంగా నమోదు చేయాలనీ , చనిపోయిన వారి వివరాలను నిబంధనల మేరకు డాకుమెంట్స్ పరిశీలించి తొలగించాలన్నారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాలలో జనగణనలో ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా గణన చేయాలన్నారు. ఎట్టిపరిస్థితులలోనూ జనగణన ప్రక్రియను వెంటనే పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు ప్రసన్న లక్ష్మి, రమణ, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు పాల్గొన్నారు.