Close

జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 25/05/2026

ఏలూరు, మే, 25 : జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం జిల్లాలో జరుగుతున్న జలధార-జలహారతి కార్యక్రమంలో చేపట్టిన పనుల ప్రగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిలాల్లో జలధార – జలహారతి కార్యక్రమంలో 82. 22 కోట్ల రూపాయలతో 1929 పనులు మంజూరు కాగా, ఇంతవరకు 380 పనులు పూర్తి అయ్యాయని, 821 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రారంభమైన పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమంలో చేపట్టిన పనులు రైతులకు, ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఉండాలన్నారు. కురిసిన ప్రతీ వర్షపు నీటిని పరిరక్షించేందుకు జలధార-జలహారతి పనులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కాలువలలో డీసిల్టింగ్ పనులను ఇరిగేషన్ శాఖ నిర్దేశించిన ప్రమాణాల మేరకు చేయాలన్నారు. కాలువలు, చెరువులలో డీసిల్టింగ్ అనంతరం ఆ మేరకు నీటినిల్వ సామర్ధ్యం పెరగాలన్నారు. జలధార కార్యక్రమంలో ఉపాధి హామీ పధకం ద్వారా పనిచేసే కూలీలకు పనిచేసే ప్రదేశంలో త్రాగునీరు, మజ్జిగ, నీడ ప్రదేశం ఏర్పాటుచేయాలన్నారు. జలధార-జలహారతి కార్యక్రమంలో చేపట్టిన పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజులలోగా పూర్తిచేయాలన్నారు. మంజూరు చేసిన పనులను చేపట్టక ముందు – చేపట్టిన తరవాత ఫోటోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. చేపట్టిన పనులు తప్పనిసరిగా నాణ్యతతో ఉండాలన్నారు. నాణ్యతా లోపం గుర్తిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.

సమావేశంలో డ్వామా పీడీ సుబ్బారావు, అదనపు పీడీ రాజశేఖర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎంపిడిఓ లు, డ్వామా ఏపిడి లు, ప్రభృతులు పాల్గొన్నారు.