Close

జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మాతా, శిశు మరణాలు సంభవిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు.

Publish Date : 20/05/2026

ఏలూరు, మే, 20 : జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మాతా, శిశు మరణాలు సంభవిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. జిల్లాలో మాతా , శిశు మరణాలు నివారణ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే అంశాలపై వైద్యులు, వైద్యాధికారులు, సిబ్బందితో స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 2711 ప్రసవాలు జరగగా, 16 మంది శిశువులు మృతి చెందడంపై అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ,. శిశువుల మృతిపై విచారణ చేసి వైద్యసిబ్బంది కారణంగా మరణాలు సంభవించాయని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్యులు, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో మాతా, శిశు మరణాలు నివారించడంలో భాగంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరిరక్షణపై గైనకాలజిస్ట్ లు పీడియాట్రిషియన్స్ తో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పరిధిలోని గర్భిణులకు దీర్ఘకాలిక వ్యాధులు, రక్తహీనత, డయాబెటిస్, బిపి, తదితర ఆరోగ్య పరీక్షలను ముందుగానే చేయించి, అందుకు తగిన విధంగా వైద్యసేవలు అందేలా చూడాలని అన్నారు. ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ముందునుండే గర్భిణీస్త్రీలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని, వైద్యసేవలు, తగు జాగ్రత్తలను తెలియజేయ్యాలని అన్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరివరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుండే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ గర్భవతి అయితే ఇబ్బంది ఉన్నప్పుడు వారికి ముందుగానే అవగాహన కలిగించాలని ఆదేశించారు. సుఖ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని, పరిస్థితి జఠిలమైతే మాతా,శిశు సంరక్షణకు తప్పని పరిస్థితుల్లో రెండవ ప్రాధాన్యతగా సిజేరియన్ కి అనుమతిని యివ్వాలని అన్నారు. వైద్య సిబ్బంది రోగులకు సేవాభావంతో సేవలందించేలా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలన్నారు.

జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, డిసిహెచ్ ఎస్ డా.బి.పాల్ సతీష్ కుమార్, ఐసిడిఎస్ పిడి పి.శారద, , ఆసుపత్రులు వైద్యులు, , వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.