Close

జిల్లాలో 46 గిరిజన గ్రామాలు ఈ రోజు (శనివారం) సాయంత్రానికి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చెయ్యాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

Publish Date : 27/09/2025

ఏలూరు/బుట్టాయిగూడెం, సెప్టెంబరు 27: బుట్టాయిగూడెం మండలం రాజానగరం ఆదిసేవా కేంద్రంలో శనివారం ఆది కర్మయోగి అభియాన్ గిరిజన గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తూ ” విలేజీ విజన్ మ్యాప్, విలేజ్ యాక్షన్ ప్లాన్ పై” ఐటిడిఏ పివో, ఆర్డీవో, జిల్లా, మండల వివిధ శాఖల అధికారులతో మండలాలు వారీగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్షించారు. సమావేశంలో గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా గ్రామాలకు కావలసిన అభివృద్ధి, విద్య, వైద్యం, గృహా నిర్మాణాలు, ఇంటి స్థలాలు, వివిధ రకాలు సామాజిక పింఛన్లు, స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని రెండుపూటలూ పుష్కలంగా అందించేలా ఇంటింటికి కుళాయి ట్యాప్లు, వ్యక్తిగత మరుగు దొడ్లు, డ్రైన్లు, రహదారులు, వ్యవసాయం, హార్టికల్చర్, సెరీకల్చర్, ఆక్వా, పరిశ్రమలు, ఆడపిల్లలను అల్లరిపెట్టే అకతాయలు జాబితా, గ్రామానికి ఏమి కావాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు తదితర పూర్తి స్థాయి నివేదికలు, తదితరుల అంశాలుపై జిల్లా కలెక్టరు సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆదిసేవా కేంద్ర ఆవరణలో జిల్లా కలెక్టరు మొక్కను నాటారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆది కర్మ యోగి పథకం జిల్లాలో తొమ్మిది గిరిజన మండలాలు బుట్టాయగూడెం 19, ఏలేరుపాడు 9, పోలవరం 5, జీలుగుమిల్లి 5,కుక్కునూరు 2, టి.నరసాపురం 1, చాట్రాయి 1, నూజివీడు 2, చింతలపూడి 2 మొత్తం 46 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశ గిరిజన సమాజాలు మన నాగరికత గుర్తింపునకు నిశ్శబ్ద సంరక్షకులుగా, దేశ సంపదకు అండగా నిలిచారన్నారు. అయినప్పటికీ దశాబ్దాలు విధానపరమైన శ్రద్ధ ఉన్నప్పటికీ, అనేక గిరిజన ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. విక్షిత్ భారత్ 2047 గిరిజన ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడిచేలా మన ప్రధమ కర్తవ్యం అన్నారు. ఆది కర్మయోగి కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రహదారులు, డ్రైనేజి, విద్యుత్, వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులు చేపడతాయన్నారు. ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలలోని ప్రతి గ్రామంలోని ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రహదారులు, డ్రైనేజి, విద్యుత్, వంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన మౌలిక సదుపాయాలపై సవివరమైన గ్రామ విజన్ ప్రణాళికలను వెంటనే రూపొందించాలని అన్నారు. పూర్తిస్థాయిలో రూపొందించిన గ్రామవిజన్ ప్రణాళికలను సంబంధిత గ్రామంలో అక్టోబరు 02వ తేదీన ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి, ప్రజలతో చర్చించి తుది ప్రణాళిక తయారు చేయాలన్నారు. అనంతరం ప్రజల ఆమోదంతో సంబంధిత నివేదికలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపాలన్నారు. అధికారులు సమర్పించిన గ్రామ విజన్ ప్రణాళికకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను రానున్న రోజులలో చేపడుతుందని తెలిపారు.కావున గ్రామ విజన్ ప్రణాళిక రూపొందించడంపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గ్రామ విజన్ ప్రణాళికను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిస్థితులను పూర్తిగా పరిశీలించి, ప్రజలతో చర్చించి రూపొందించాలని, ప్రణాళిక రూపొందించడంలో సంబంధిత శాఖల అధికారులు ఏదైనా పొరపాటు చేస్తే అందుకు వారే బాధ్యులు ఆవుతారని జిల్లా కలెక్టరు హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, ఆర్డీవో యం.వి.రమణ, ట్రైబల్ వెల్ఫేర్ డిడి యన్.శ్రీవిద్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ విశ్వ మోహన్ రెడ్డి, ఐసిడియస్ పిడి పి.శారద, జిల్లా పంచాయతీ రాజ్ యస్ఇ జెడ్.రమేష్ , డివిజనల్ పంచాయతీ అధికారి ఏ.వి. సుబ్బరాయన్, గిరిజన కార్పొరేషన్ డైరెక్టరు యం.కన్నపరాజు, మండల వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు యం.రామతులసి, గ్రామ సర్పంచి కె.దుర్గమ్మ, సచివాలయ, ఐటిడిఏ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.