జిల్లా అంతటా ఈనెల 21వ తేదీన పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఏలూరు, జూన్, 20 : ఈనెల 21 తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, జిల్లాలోని గ్రామ, వార్డ్ సచివాలయ పరిధిలో గుర్తించిన 5616 వేదికల్లో, 9 లక్షల మందికి పైగా ప్రజలు యోగాభ్యాసన పాల్గొంటున్నారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేసారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తరువుల మేరకు మే, 21 వతేదీ నుండి జూన్, 21 వతేదీ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 9 లక్షల 59 వేల 635 మంది తమ పేర్లను యోగాంధ్ర యాప్ లో నమోదు చేసుకున్నారని,100 మంది మాస్టర్ ట్రైనలు 6104 మంది ట్రైనర్లకు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారని, సదరు ట్రైనర్లు జిల్లాలోని గ్రామ, మండల, జిలాల్లోని అన్ని ప్రాంతాలలోని ప్రజలకు యోగాసనాలపై శిక్షణ అందించామన్నారు. జిల్లాలో యోగాభ్యాసం కార్యక్రమాలలో 7, 79, 657 మంది పాల్గొనగా,, వారందరికీ సర్టిఫికెట్లు అందించామని, అదేవిధంగా 1, 82, 644 మందికి ఎక్సలెన్సీ సర్టిఫికెట్లు అందజేశామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో వివిధ పోటీలు నిర్వహించామని, వాటిలో గ్రామ స్థాయిలో 23 వేళా 841 మంది, మండల స్థాయిలో 3083 మంది, జిల్లా స్థాయిలో 100 మంది పాల్గొన్నారన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలలో స్కిట్ అండ్ రోల్ ప్లే , యోగా స్లొగన్స్ విభాగాలలో మన జిల్లా ప్రధమ స్థానం పొందిందని, విజేతలకు ఈనెల 21వ తేదీన విశాఖపట్నం లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా బహుమతులు అందుకుంటారన్నారు. ఏలూరులో సర్.సి. .ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్, ఇన్డోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియం మూడు ప్రదేశాలలో నిర్వహిస్తున్నామని, ఒకొక్క ప్రదేశంలో 5 వేల మందికి పైగా యోగాభ్యాసన చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి వివరించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.