జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత ఉండేలా పటిష్టమైన ప్రణాలికను రూపొందించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు.
ఏలూరు, ఏప్రిల్, 16 : జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత ఉండేలా పటిష్టమైన ప్రణాలికను రూపొందించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం ఇంచార్జి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజల అవసరాలకు, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను అవసరమైన ఇసుక ను అందుబాటులో ఉంచేవిధంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీస్లిటేషన్ పాయింట్, స్టాక్ పాయింట్ల నుండి వినియోగదారుల వద్దకు చేర్చేందుకు రవాణా చార్జీలు ఖరారు చేయాలనీ రవాణా శాఖాధికారులను ఆదేశించారు. డీస్లిటేషన్ పాయింట్, స్టాక్ పాయింట్ల వద్ద సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాక్ పాయింట్ నుండి వినియోగదారులకు సరఫరాకు వినియోగించే వాహనాలకు తప్పనిసరిగా జిపిఎస్ విధానం ఉండాలని, వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. వేసవి దృష్ట్యా గోదావరి నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంది ఇసుక లభ్యత ఎక్కువగా ఉంటుందని, జిల్లాలో రాబోయే వర్షాకాలం సీజన్లో ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా స్టాక్ పాయింట్ల వద్ద ఇసుకను నిల్వ చేయాలన్నారు.
సమావేశంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఉప రవాణా కమీషనర్ షేక్ కరీం, ఆర్టీఓ లు కృష్ణారావు, మదానీ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రవికుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.