Close

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి అధికారులతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 26/10/2025

ఏలూరు, అక్టోబర్, 26 : జిల్లాలో తుఫాన్ ముంపు ప్రాంతాలలో తుఫాన్ సహాయక కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మొంథా తూఫాన్ పై జిల్లా, మండల అధికారులు, నియోజకవర్గ,మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ ఆదివారం రాత్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తూఫాన్ సహాయక కేంద్రాలు ఏర్పాటుచేసిన తుఫాన్ ముంపు ప్రాంతాలలోని ప్రజలను వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. గ్రామాలలో శిధిలావస్థలో ఉన్న భవనాలు, పూరిళ్లను గుర్తించి వాటిలోని ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితిలో వినియోగించేందుకుగాను జెసిబి, చెట్లు కట్ చేసే యంత్రాలు, ఇసుక బస్తాలు, అంబులెన్స్ లను ఉంగుటూరు, కలపర్రు టోల్ ప్లాజాల వద్ద , దేవరపల్లి, జీలుగుమిల్లి జాతీయ రహదారి వెంబడి సిద్ధంగా ఉంచడం జరిగిందని, అత్యవసర సమయంలో వినియోగించుకోవాలన్నారు. ఆర్ అండ్ బి., విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సెల్ ఫోన్ టవర్ల వద్ద నెట్ వర్క్ నకు అంతరాయం కలగకుండా జెనరేటర్ లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైన డీజిల్ కూడా ఉంచాలని, వీటిని సంబంధిత తహసీల్దార్లు తనిఖీ చేయాలన్నారు. . గోదావరి నదిలో పర్యాటక లాంచీలను నిలిపివేయాలని పర్యాటక అధికారిని కలెక్టర్ ఆదేశించారు. తూఫాన్ సమయంలో నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలలో క్లౌడ్ బరస్ట్ రీతిలో భారీవర్షం కురవవచ్చని, ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాలలో ప్రజలను రక్షించేందుకుగాను బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలనీ జిల్లా అగ్నిమాపక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తూఫాన్ ప్రభావం ముగిసే వారుకు కంట్రోల్ రూంలు 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.