Close

జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం. జె.అభిషేక్ గౌడ పాల్గొన్నారు.

Publish Date : 03/07/2026

ఏలూరు/ దెందులూరు, జూలై 03: దెందులూరు నియోజకవర్గం దెందులూరు మండల ప్రజా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం దెందులూరు మండలానికి సంబంధించిన మొదటి విడత “ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ లు సంయుక్తంగా పాల్గొని ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు మేరకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజలు సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. నేడు స్వీకరించిన అర్జీలుపై పరిష్కరించిన పూర్తినివేదికలు, ఫొటోస్ తో సహా వచ్చే సమావేశానికి హాజరు కావాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యలను పారదర్శకంగా పరిష్కరించి ప్రజలకు మరింత చేరువకావాలని, పరిష్కారం కాని సమస్యలుపై అర్జీదారులకు సరైన కారణాలను వివరించాలని పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలను కాలయాపనలు చెయ్యకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ఒక్కసారి వచ్చిన అర్జీ మరలా రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి అధ్యయనం చేసి పరిష్కారం చెయ్యాలని అన్నారు.

ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రత్యేక ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. నియోజవర్గంలో ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరో మూడు పర్యాయములు నిర్వహించడం జరుగుతోందని, ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ సమస్యలను కూడా అర్జీలు సమర్పిస్తే అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 22 (ఏ) భూసమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి, పూర్తిస్థాయిలో భూసమస్యలు పరిష్కరించాలని అన్నారు. అర్జీలను పరిశీలించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముగింపు చెయ్యవద్దని కోరారు. అధికారులు సేవాభావంతో, సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కారానికి కృషిచెయ్యాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని, నియోజకవర్గంలో నిరుపేద అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చెయ్యాలని కోరారు. నియోజకవర్గంలో కొంతమంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని, విచారణ చేసి వారిని తొలగించి అర్హులకు పింఛన్లు మంజూరు చెయ్యాలని కోరారు.

ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని.

దెందులూరు మండలం తిమ్మన్నగూడెం గ్రామ నివాసి నరావుల వీరవెంకట సత్యనారాయణ నా భూమిని అక్రమిస్తుకున్నారని, విచారణ చేసి పరిష్కారం చూపాలని కోరారు, దెందులూరు మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాసరావు రౌడవరిగుంట కాలువ ఆక్రమణకు గురైందని, సర్వేచేసి ఆక్రమణలు తొలగించి పరిష్కారం చెయ్యాలని కోరారు, దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన కొక్కిరిపాటి నాగరాజు గాంధీనగర్ క్రొత్తకాలనీలో ఒక రహదారి మాత్రమే ఉందని, రెండవ రహదారిని ఏర్పాటు చెయ్యాలని కోరారు, దెందులూరు మండలం కొవ్వలి గ్రామం మల్లవరపు పద్మావతి మాకు ఉమ్మడి ఆస్తి తగదాలు ఉన్నాయని పరిష్కరించాలని అర్జీని ఇచ్చారు, దెందులూరు మండలం శ్రీరామపురం గ్రామనివాసులు మోతుకూరి నరసింహ శోభనబాబు దెందులూరు రైల్వేగేటు మూసి నెలరోజులు అయిందని, గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నామని పరిష్కారం చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టరు వి.వి.యస్.శర్మ, జిల్లా, డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు, తహశీల్దారు బి.సుమతి, యంపిడివో కె.వీరప్రతాప్, ఏయంసి ఛైర్మన్ గారపాటి రామసీత, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.