జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి అధికారులతో సమీక్షించిన సంక్షేమ పధకాల అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కె. ఆమ్రపాలి

ఏలూరు, ఏప్రిల్, 2 : అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో ఏలూరు జిల్లా ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలనీ సంక్షేమ పధకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె. ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాల అమలును వివిధ శాఖల అధికారులతో జిల్లా ప్రత్యేక అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి, ఏలూరు జిల్లాను రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రగతిపథంలో నిలపాలన్నారు. వ్యవసాయ ప్రధానమైన ఏలూరు జిల్లాలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంను పెంపొందించేందుకు రైతులకు ప్రభుత్వం అందించే చేయూతపై రైతులకు అవగాహన కలిగించి, మరింత విస్తీర్ణంలో సాగుచేసేలా చూడాలన్నారు. ఉద్యానవన పంటలకు, ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద కూలీలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కల్పించనున్న పనిదినాలు, చేపట్టవలసిన పనులపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, జిల్లాలో సామజిక భద్రతా పెన్షన్ల పంపిణీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ , పాపికొండలు, కొల్లేరు ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2. 65 లక్షల మంది పేదలకు ప్రతీనెలా 112. 50 కోట్ల రూపాయలు సామజిక పెన్షన్లుగా అందిస్తున్నామని, మొదటిరోజే దాదాపు 98 శాతం వరకు పెన్షన్ల పంపిణీ పూర్తిచేస్తున్నామన్నారు. ఏలూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి, ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన ఉత్పత్తులు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 2. 50 లక్షల ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరిగి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారని, 50 ఉత్పత్తులు అమ్మకాలతో ఏలూరు జిల్లా మూడవ స్థానం సంపాదించిందన్నారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రగతిని సాగిస్తున్నామని, ఉద్యానవన పంటలలో ఆయిల్ పామ్ అధిక విస్తీర్ణంలో సాగవుతుందన్నారు. అదేవిధంగా కోకో పంటను ఆయిల్ పామ్, కొబ్బరి తోటలలో అంతర పంటగా 35 వేల సాగవుతున్నదని, మిరియాలు, యాలకులు, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, వంటి పంటలకు అనుకూల పరిస్థితులు కల్పించి జిల్లాలో ఔత్సాహిక రైతులు సాగుచేస్తున్నారన్నారు. జిల్లాలో 31 జాబ్ మేళాలు నిర్వహించి 1657 మంది యువతకు వివిధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వ్యవసాయ ప్రధానమైన ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని నెలకొల్పేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. .
సమావేశంలో డిఎఫ్ ఓ శుభం, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, డిఆర్డీఏ, డ్వామా పీడీ విజయరాజు, కె. వి. సుబ్బారావు, ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీలత, వ్యవసాయాధికారి హబీబ్ బాషా, పశుసంవర్ధక శాఖ జెడి డా. గోవిందరాజులు, డిపిఓ అనురాధ, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్,పంచాయత్ రాజ్,ఆర్ డబ్ల్యూ ఎస్, ఆర్అండ్ బి ఎస్ఈ లు రమణమూర్తి, త్రినాధ్ బాబు, పి . వి. రత్నం, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, ప్రభృతులు పాల్గొన్నారు.