• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో సమీక్ష

Publish Date : 02/07/2025

ఏలూరు, జులై, 2 : పేదప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యులు, వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చైర్ పర్సన్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తో కలిసి సమీక్షించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఆసుపత్రి వైద్యాధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం ద్వారా ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దెందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, అల్ట్రాసౌండ్ స్కానింగ్, 2డి ఎకో వంటి రేడియాలజీ విభాగంలో వైద్యుల నియామకం చేపట్టాలని అంతవరకూ ప్రజల సేవలకు అంతరాయం కలగకుండా తాత్కాలిక విధానంలో వైద్యుల సేవలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు వైద్య సేవలందించే విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన సేవలందేలా వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అత్యవసర పరిస్థితిలో రోగులు వస్తుంటారని, వారికి వెంటనే చికిత్స అందేలా వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, వైద్య సేవల లోపం కారణంగా ఎటువంటి మరణం సంబవించకుండా డాక్టర్లు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఒక్క పేదవాడు తనకు వైద్య సేవలు అందలేదని ఫిర్యాదు చేయకుండా వైద్యాధికారులు రోగులకు సేవలందించాలన్నారు. సదరం లో నమోదు చేసుకున్న వారికి వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మెడికల్ రేయింబర్సమెంట్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో, ఆవరణలో, టాయిలెట్ లలో పూర్తిస్థాయిలో పారిశుధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజాప్రతినిధులుగా తాము పూర్తి సహకారం అందిస్తామని, వైద్య సేవలలో జిల్లా ఆసుపత్రిని జిల్లాలోనే ఉన్నతంగా తీర్చిదిద్దెందుకు సహాయ, సహకారాలు అందిస్తామని, అదే సమయంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలందించడంలో వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రసూతి విభాగంలో మరిన్ని బెడ్స్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర సమయంలో రోగులను విజయవాడ వంటి ప్రదేశాలకు తరలించేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ లు అందుబాటులో లేవని, అంబులెన్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులలో అల్ట్రాసౌండ్ స్కానింగ్, గుండె జబ్బులకు 2డి ఎకో స్కానింగ్ చేసేందుకు డాక్టర్లు అందుబాటులో లేరని, రేడియాలజిస్ట్ పోస్ట్లు భర్తీ చేయాలనీ కోరారు.
సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శశిధర్, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలిని, రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ చైర్మన్ డా. ఎం.బి.ఎస్. వి., ప్రసాద్, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రిలోని వివిధ విభాగాల వైద్యాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.