టీమ్ వర్క్ తో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపాలి.. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్..
ఏలూరు,ఏప్రిల్,23: పేద ప్రజల సంక్షేమం ఆకాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలు సాధించడానికి అధికారులంతా టీమ్ వర్క్ తో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ సూచించారు. బుధవారం స్దానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ల్యాండ్ అసైన్మెంట్ ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులు, తహశీల్దార్లు, యంపిడివోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కలిసి పనిచేయడం ద్వారా సమస్యలకు మరింత సమగ్రమైన పరిష్కారాలను కనుగొనవచ్చన్నారు. టీమ్ వర్క్ ద్వారా పనులు వేగంగా, సమర్ధవంతంగా పూర్తవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాను ఐదో స్ధానం నుంచి మూడవ స్ధానానికి తీసుకురావాలన్నారు. ల్యాండ్ అసైన్మెంట్ లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రణాళిక బద్దంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్ధితులు కల్పించాలన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. పి-4 కార్యక్రమం కింద ప్రతి కుటుంబంలో ఒకరికి ఉపాధి, వ్యాపారవేత్తగా తీసుకురావడానికి అనువైన పరిస్ధితులు కల్పించాలన్నారు. జిల్లాలో వెదురుతో తయారుచేసే ఉత్పత్తులకు ఇతర జిల్లాలలో మార్కెటింగ్ సదుపాయం కలిగే విధంగా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. వారికి అవసరమైన వెదురు సరఫరాలో ఎటువంటి అవరోధాలు లేకుండా అటవీశాఖ అధికారులు చూడాలన్నారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా క్షేత్రస్ధాయిలో చివరిస్ధాయి వరకు అర్హులైన లబ్దిదారులకు అందించడంలో శ్రమించాలన్నారు. దీపం పధకం మొదటి దశలో సబ్సిడీ అందించామని, అదే విధంగా రెండవ దశలో కూడా లబ్దిదారులకు అందించడంలో ఎంపిడివోలు, తహశీల్దార్లు సమిష్టిగా సమీక్షించాలన్నారు. హౌసింగ్ విషయంలో కూడా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలన్నారు. త్వరలో 9,407 కోట్ల రూపాయలతో తల్లికి వందనం అమలు చేయబోతున్నామన్నారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వర్తంప చేస్తామన్నారు. జూన్ 12న పాఠశాలలు తెరచిన వెంటనే రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్ లో మధ్యాహ్నం భోజనం పధకం అమలుకు నాణ్యమైన బియ్యం సరఫరాచేసే కొత్త విధంగా ప్రభుత్వం అమలు చేయబోతుందన్నారు. త్రాగునీటి విషయంలో అత్యధిగా ప్రాధాన్యతనిచ్చి నీటి ఎద్దటి నివారణను ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ వారి దగ్గర అందుబాటులో నిధులు ఉంచడమైందన్నారు. మరి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులకు ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలన్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖలు అన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. అంత్యోధయ అన్నయోజన కింద ప్రతి కుటుంబానికి 35 కిలోలు బియ్యం ఉచితంగా అందించే కార్యక్రమం ప్రారంభించామని, ఈ విధంగా ఏలూరు జిల్లాలో 8 వేల మందికి అందిస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధే ద్యేయంగా ప్రతినెలా రెండు మూడు రోజులు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటిస్తామని తెలిపారు. రెవిన్యూ సమస్యలు తలెత్తకుండా తహశీల్దార్లు తమ స్ధాయిలో స్పందిస్తే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల వరకు రావని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తహశీల్దార్లు క్షేత్రస్ధాయిలో విస్త్రృతంగా పర్యటించి చిన్న చిన్న సమస్యలు తమ స్ధాయిలోనే పరిష్కరించాలన్నారు. మరి ముఖ్యంగా ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ లో అందే అర్జీలను వాస్తవ పరిస్ధితులను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి వినతులను, సమస్యలను గౌరవ ప్రధంగా స్వీకరించాలన్నారు. ఆయా శాఖల పరిధిలో అమలుచేసే కార్యక్రమాల సమాచారాన్ని ఆయా స్ధానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, యంపిడివోలు పాల్గొన్నారు.