Close

డ్వాక్రా సంఘాలకు, యువతకు స్వయం ఉపాధి రుణాల మంజూరుతో పాటు యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి జిల్లా బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

Publish Date : 26/09/2025

ఏలూరు, సెప్టెంబర్, 26 : జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు మంజూరు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 70 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించామని, 20 వేల 500 మంది కౌలు రైతులకు 375 కోట్ల రూపాయలు రుణాల లక్ష్యానికి గాను ఇంవరకు కేవలం 5772 మంది కౌలు రైతులకు 31. 69 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ జిల్లాలో మండలస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించి అర్హులైన ప్రతీ రైతుకు, కౌలు రైతుకు రుణాలు మంజూరును వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 13 వేల 845 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా, ఇంతవరకు 31. 31 శాతం మేర 5712 కోట్ల రూపాయలు రుణాలుగా అందించారని, వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి రుణాలు మంజూరును మరింత వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని 14 వేల 445 స్వయం సహాయక సంఘాలకు 1180 కోట్ల రూపాయలు రుణాలు లక్ష్యంగా కాగా ఇంతవరకు 6489 స్వయం సహాయక సంఘాలకు 357. 88 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసారని, వీటిని కూడా లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. డ్వాక్రా సంఘాలకు, యువత స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేయడంతోపాటు యూనిట్ల ఏర్పాట్లలో కూడా వారికి సాంకేతిక సహాయం అందించి త్వరిగతిన యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిఎం సూర్య ఘర్ యోజన మూఫ్తి బిజిలి యోజన లో దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు వెంటనే మంజూరు చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ లో జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 100 యూనిట్ల లక్ష్యానికి గాను, 41 యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు బ్యాంకర్లకు అందించగా 16 దరఖాస్తులు మంజూరు కాబడి, 22 దరఖాస్తులు బ్యాంకర్ల పరిశీలనలో ఉన్నాయని, నిర్దేశించిన నిబంధనల మేరకు లేని 3 దరఖాస్తులు బ్యాంకర్లు తిరస్కరించారన్నారు. తిరస్కరించబడిన ధరఖాస్తులలో కారణాలు తెలుసుకుని సమస్యలను పరిష్కరించి, తిరిగి దరఖాస్తు చేసుకునేలా బ్యాంకర్లు దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు.

సమావేశంలో యూనియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎన్. శ్రీనివాసరావు, ఆర్బిఐ ఎల్డిఓ గిరిధర్, ఎల్ డిఎం డి. నీలాధ్రి, నాబార్డు డిడిఎం పి. అనీల్ కాంత్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, పశుసంవర్ధక శాఖ జెడి బి. ప్రసాదరావు, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారి ఎస్. రామ్మోహన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం. హబీబ్ భాషా, బి.సి. కార్పోరేషన్ ఈడి ఎన్. పుష్పలత, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల జిల్లా కో ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.