Close

తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కొనియాడారు.

Publish Date : 28/05/2026

ఏలూరు, మే, 28 : తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు గురువారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ లు ఎన్ .టి. రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్ .టి. రామారావు ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు పాలనాపరమైన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. సామజిక పెన్షన్లు, మహిళలకు ఆస్తిలో హక్కు, పేదల ఆరోగ్య భద్రతకు 2 రూపాయలకే కిలో బియ్యం వంటి ఎన్నో పధకాలను తీసుకువచ్చారన్నారు. రాజకీయవేత్తగానే కాక నటుడిగా కూడా అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన నటనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్నారు. ప్రజలకు మెరుగైన పాలనతో పాటు ప్రజలకు సంతృప్తికరమైన రీతిలో సేవలను అందించేందుకు ప్రాధాన్యతను ఇచ్చేవారన్నారు.

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పేదలు, రైతుల సంక్షేమానికి డా. నందమూరి తారక రామారావు ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారన్నారు. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టి, ముఖ్యమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారన్నారు. సామజిక పెన్షన్లను అన్న రామారావు గారు 30 రూపాయలతో ప్రవేశపెట్టారని, ఆ పెన్షన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 4 వేల రూపాయలకు తీసువెళ్లారన్నారు. ప్రజల ఆహారభద్రతకు 2 రూపాయలకే కిలో బియ్యం పధకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పేదప్రజలకు కూడు, గూడు, నీడ అందిస్తానని వాగ్దానం చేసి అమలు చేసి చూపించారన్నారు.

కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, ఆర్డీఓ కె. లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, ఎస్డిసి భాస్కర్, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, పర్యాటకాధికారి పట్టాభి రామయ్య, ఐసిడిఎస్ పీడీ శారద, ఎల్డిఎమ్ నీలాద్రి, కలెక్టరేట్ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.