Close

దెందులూరు జిల్లాపరిషత్ హైస్కూల్ ప్లస్ లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి మెగా పిటిఎం -3. O లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Publish Date : 05/12/2025

దెందులూరు/ ఏలూరు, డిసెంబర్, 5 : ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచేందుకు పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక శ్రీమతి గారపాటి హైమావతి దేవి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ లో శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగిన మెగా పిటిఎం -3. O కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని ప్రతీ తల్లితండ్రులు తెలుసుకుని వాటిని మెరుగుపరచుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. గత జులై, 10వ తేదీన జిలాల్లోని అన్ని ప్రభుత్వ, పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన మెగా పిటిఎం -2. O కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. విద్యావ్యవస్తలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని, వాటిని అందిపుచ్చుకుని విద్యార్ధులు ఉజ్వల భవితను సాధించాలన్నారు. . ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత స్థాయిని సాదించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఏ సబ్జెక్టులలో ఏ విద్యార్థి వెనుకబడి ఉన్నాడో తెలుసుకుని, వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అందుకు అనుగుణంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తాను అందిస్తానని, అందుకు ప్రతిగా చక్కగా చదువుకుని మంచి ఫలితాలు సాదించాలన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో తల్లికి వందనం కార్యక్రమానికి అత్యధిక నిధులు కేటాయించడం , విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటిని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులతో చర్చించేందుకు పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు మంచి వేదికని, ఇటువంటి కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రతీ విద్యార్థి తల్లితండ్రులు మెగా పిటిఎం కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దెందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా రైజింగ్ స్టార్ సాధించిన విద్యార్థి, ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులు, మాక్ అసెంబ్లీ కి ఎంపికైన విద్యార్థులకు మెమెంటోలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు
ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన క్రీడా పరికరాలు, ప్రహరీ గోడ, టాయిలెట్లు, క్రీడా స్థలం అభివృద్ధి, సైకిల్ స్టాండ్ తదితర సౌకర్యాలను కల్పించాల్సిందిగా విద్యార్థులు కోరగా, మంజూరు చేస్తామని కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. .
ఈ సందర్భంగా బాల్య వివాహాలను నిర్మూలిస్తామని సభకు హాజరైన అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో జిల్లా విద్య శాఖాధికారి వెంకటలక్ష్మమ్మ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ ఐసిడిఎస్ శారద, జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, తహసీల్దార్ సుమతి, ఎంఈఓ ఏ .వి. ఎన్ .వి. ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లపట్ల విజయ్ కుమార్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బొత్సా కిషోర్, సర్పంచ్ తోట ఏసమ్మ ప్రభృతులు పాల్గొన్నారు.

అనంతరం పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, తల్లితండ్రులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లు భోజనం స్వయంగా వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.