దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు సంబందించిన ప్రతిపాదనలు వెంటనే రూపొందించి పంపాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా. ఎన్ . యువరాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ఏలూరు/దెందులూరు, జనవరి, 13 : దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు సంబందించిన ప్రతిపాదనలు వెంటనే రూపొందించి పంపాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా. ఎన్ . యువరాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం సోమవరప్పాడులో దెందులూరు నియోజకవర్గ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు సంబందించి స్థల పరిశీలనను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, పరిశ్రమలు, రెవిన్యూ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం డా. యువరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ కార్యదర్శి డా. యువరాజ్ మాట్లాడుతూ సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని, రోడ్డు, రైల్, విమాన రవాణా సౌకర్యాలకు అనుగుణంగా ఉన్న భూములను గుర్తించినట్లయితే త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి, ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో చింతలపూడిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు శంఖుస్థాపన జరిగిందని, పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ ఎంఎస్ఎంఈ పార్క్ ల ఏర్పాటుకు త్వరితగతిన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని డా. యువరాజ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం దెందులూరు గ్రామంలో ఏర్పాటుచేస్తున్న సాన్సో (saanso) ఫార్మా పరిశ్రమ నిర్మాణాన్ని పరిశ్రమల శాఖ కార్యదర్శి డా. యువరాజ్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి పరిశీలించి, పరిశ్రమ వివరాలను డా. యువరాజ్ పరిశ్రమ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
కార్యదర్శి వెంట జిల్లా పరిశ్రమల శాఖాధికారి వెంకటరావు, జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, తహసీల్దార్ సుమతి , ప్రభృతులు పాల్గొన్నారు.