ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి దర్శన ఏర్పాట్లను ఎస్పీ, ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ద్వారకా తిరుమల /ఏలూరు, డిసెంబర్, 29 : ముక్కోటి ఏకాదశి రోజున ప్రతీ ఒక్క భక్తుడుకి సంతృప్తికరమైన దర్శనం కలిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు దర్శన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ , గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం దేవాలయ అతిధి గృహంలో అధికారులతో దర్శన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారిని 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున, భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అందుకు తగినవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ లైన్లలో భక్తులు రద్దీ కారణంగా ఎలాంటి తోపులాటలు లేకుండా జరగకుండా చూడాలని, గర్భిణీలు, చిన్న పిల్లలు, వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఏ భక్తుడుకైన అనారోగ్యం కారణంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే తీసుకోవలసిన చర్యలపై విధులలో ఉన్న సిబ్బందికి అవగాహన కలిగించాలని, అంబులెన్స్, వైద్య సిబ్బంది ఉన్న ప్రదేశం గురించి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తెలిసేలా చూడాలన్నారు. క్యూ లైన్ లను సక్రమ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉచిత దర్శనం, 100, 200, 500 రూపాయల దర్శనాలకు ప్రత్యేక కౌంటర్లు, క్యూ లైన్లు ఏర్పాటుచేసి, క్యూ లైన్లలో రద్దీ లేకుండా చూడాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, భక్తుల సంఖ్యకు తగిన విధంగా త్రాగునీరు, టాయిలెట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. భక్తులు దర్శనానికి వెళ్లే మార్గం, తిరిగి బయటకు వచ్చే మార్గాలు, కంపార్టుమెంట్లు, క్యూ లైన్ల వెంబడి తోపులాటలు జరగకుండా సిసి కెమెరాలతో పర్యవేక్షించాలని, ఎక్కడైనా తోపులాట జరిగితే వెంటనే భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రించి, సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసాదం తయారీ ప్రదేశంలో ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చూడాలన్నారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భద్రతను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సిసి కెమెరాల ద్వారా అన్ని ప్రదేశాలలో పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటలను జరిగే అవకాశం ఉందన్న అనుమానం వచ్చిన వెంటనే భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి అందుకు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సంఖ్యకు తగిన విధంగా ప్రసాదాలు తయారీ ఉండాలని , అంతేకాక ప్రసాదం, సెల్ ఫోన్, లగేజి కౌంటర్లు పెంచాలన్నారు.
భక్తులను ముందుగా కంపార్ట్మెంట్ లలో ఉంచాలని, క్యూ లైన్లలో రద్దీ లేకుండా కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి అనుమతించాలన్న.
గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా గత సంవత్సరం కన్నా మెరుగ్గా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు ఆధ్యాత్మిక భావనతో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం 35 వేల మంది భక్తులు విచ్చేశారని, ప్రస్తుత ముక్కోటి ఏకాదశికి అంతకుమించి అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లను పరిశీలించవలసిందిగా కోరిన వెంటనే వచ్చి, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఎమ్మెల్యే కృతఙ్ఞతలు తెలియజేసారు.
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, డిఎస్పీ శ్రావణ్ కుమార్, ట్రైనీ ఐపిఎస్ జయ శర్మ, దేవాలయ బోర్డు చైర్మన్ ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్.వి. ఎన్ . ఎన్ . నివృతరావు ఈఓ ఎన్ .వి.ఎస్. ఎన్ . మూర్తి, ఈఈ డి . వి. భాస్కర్, తహసీల్దార్ జె.వి. సుబ్బారావు, ఎంపిడిఓ ప్రకాష్, సర్పంచ్, ప్రభృతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్ లు, ఆలయం నుండి బయటకు వచ్చే మార్గాలు, పార్కింగ్, ఆలయంలో ఉత్తరద్వార దర్శనం వద్ద ఏర్పాట్లు లను ఎస్పీ, ఎమ్మెల్యేతో కలిగి కలెక్టర్ పరిశీలించారు.