Close

నీట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్..

Publish Date : 20/06/2026

ఏలూరు, జూన్ 20: ఏలూరు జిల్లాలో ఈనెల 21వతేదీ ఆదివారం జరగనున్న నీట్(యుజి)2026 రీ ఎగ్జామినేషన్ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాల, గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల, ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఈనెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను సజావు వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్బంగా పరీక్షల నిర్వహణకు తీసుకోవల్సిన చర్యలపై పరీక్షా కేంద్రాల ఛీఫ్ సూపరింటెండెంట్లకు తగిన సూచనలు జారీచేశారు. పరీక్షా కేంద్రాలకు నియమింపబడిన సిబ్బందికి సంబంధించి వారి బందువులు గానీ, పిల్లలు గానీ ఎవ్వరూ ఆ కేంద్రంలో నీట్ పరీక్షలు వ్రాయడం లేదని డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. సెల్ ఫోన్లను అనుమతించబడవని స్పష్టం చేశారు. జిల్లాలో 1674 మంది అభ్యర్ధులు నీట్ పరీక్ష వ్రాయనున్నారని ఇందుకోసం 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్ధులు అడ్మిట్ కార్డు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, బ్లూ టూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్ లేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని అభ్యర్ధులకు సూచించారు. ఎన్ టిఏ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నకిలీ గుర్తింపు కార్డులు,పొటోలతో ఒకరి తరపున మరొకరు పరీక్ష వ్రాసేందుకు వచ్చినట్టు తనిఖీల్లో గుర్తిస్తే పోలీసులకు అప్పగించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షా పత్రాలను ఆయా పరీక్షా కేంద్రాలకు తగిన పోలీస్ భద్రత మద్ధ్య తరలించడం పరీక్ష పూర్తయ్యాక తిరిగి ఆయా జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూమ్ కు తీసుకువచ్చి సిసిటివి నిఘా మధ్య భద్రపర్చాల్సి ఉందని దీనిపై సంబంధిత అధికారలులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. నీటి పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2గం.ల నుండి సా.5.15 గం.ల వరకూ నిర్వహించడం జరుగుతుందని ఆయా పరీక్షా కేంద్రాలకు వెలుపల ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి నిషేధాజ్ణలు అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని ఫోటోకాపీ దుకాణాలు, సైబర్ కేఫ్‌లుపై ప్రత్యేక నిఘా ఉంచి నిషేధాజ్ఞలను అమలు చేయాలని ఆదేశించారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఓఆర్ఎస్ ఫ్యాకెట్లు,ప్రాధమిక చికిత్స సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ
జిల్లాలో నీట్ పరీక్షలు సజావుగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా పటిష్టమైన బంధోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 6 నిర్ధేశిత పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులు సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్ధుల సౌకర్యార్ధం ఆర్ టి సి బస్టాండ్ వద్ద ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా చిన్నపాటి ఘటనలు జరిగినా లేదా అనుమానస్పద సమాచారం ఉన్నా వెంటనే డైల్ 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెం. 8332959175 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెం. 9550351100 కి తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో పేపర్ లీకేజీ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసే వారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

వీరి వెంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షల లైజన్ ఆఫీసర్ డా. జి. గిరిబాబు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, పరీక్షల సిటీ కోఆర్డినేటర్ భూర్ సింగ్ మీనా,ఆర్డిఓ కె. లక్ష్మీ ప్రసన్న, డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, టూ టౌన్ ఇన్సేక్టర్ అశోక్ కుమార్, ఎస్సై రామకృష్ణ, ఎల్ డిఎం ఎన్. నీలాధ్రి, మున్సిపల్ కమీషనర్ ఎ. భాను ప్రతాప్, తహశీల్దారు గాయిత్రీ, పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.