Close

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 29/01/2025

ఏలూరు,జనవరి, 29: జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియేట్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలకు 33,511 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు చెప్పారు. విద్యార్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షా అనంతరం తిరిగి వారి స్వస్ధలాలకు చేరుకునేలా ఆర్.టి.సి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత బస్సుల ఫిట్ నెస్ ను ముందుగానే పరీశీలించుకోవాలని కండిషన్ లో ఉండేటట్టు చూచుకోవాలన్నారు. కొన్ని అధనపు బస్సులను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలు, ప్రాక్టికల్స్ నిర్వహించే అన్ని సెంటర్లలో సిసి కెమేరాల నిఘా ఉంచాలన్నారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్ గా నిర్ధేశించడం జరిగిందని పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ 08812-230197 ఫోన్ నెంబరుతో ఏర్పాటు చేశారని, దీంతో పాటు కలెక్టరేట్, పోలీస్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్ధులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాక్టికల్స్.థీయరీ పరీక్షలకు ఫ్లైయింగ్ స్కాడ్లు, సిట్టింగ్ స్కాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్ల ను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష ముగిసేవరకు ఆయా షాపులను మూసివుంచాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలుతీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. త్రాగునీరు, పారిశుద్యం ఏర్పాట్లను ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయా అధికారులకు అప్పగించిన విధులను అందరూ బాధ్యతతో నిర్వహించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్-163 బిఎన్ఎస్ఎస్ అమలు చేయాలన్నారు. ప్రశ్నాపత్రాలను తరలించే సమయంలో ఆ వాహనాలకు జిపిఎస్ ఉండేలా పరిశీలించుకోవాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి (ఆర్ఐఓ) కె. చంద్రశేఖర్ బాబు మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 29 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్(ఒకేషనల్), ఫిబ్రవరి 10 నుంచి నుంచి 20వ తేదీ వరకు 69 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్(జనరల్) పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

సమావేశంలో అధనపు అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్ఐఓ కె. చంద్రశేఖర్ బాబు, డివిఇవో బి. ప్రభాకరరావు, డిఇసి కమిటీ సభ్యులు కె. యోహాన్, ఎల్. శ్యామ్ కుమార్, బి.వి. శ్రీనివాస్, పి. జ్యోతి, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, డిపివో కె. అనురాధ లతో పాటు పోస్టల్, వైద్య ఆరోగ్యశాఖ, ట్రాన్స్ కో ,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.