పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. మార్చి 17 నుండి 31 వరకు 10 వ తరగతి పరీక్షలు.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,ఫిబ్రవరి,14: పదో తరగతి పరీక్షల నిర్వహణకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షా పత్రాలు భధ్రపర్చే కేంద్రంలో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 17 నుండి 31 వరకు 10 వ తరగతి రెగ్యులర్ వారికీ , 17 నుండి మార్చ్ 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు 10 వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 133 కేంద్రాల్లో 25,179 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. ఓపెన్ స్కూల్స్ నుండి 793 , మంది విద్యార్ధులకు గానూ 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. . విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమగు బస్సులను నడపాలని, సంబంధిత సమయాలను ముందుగా పత్రికా ముఖంగా తెలియజేయాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలు కట్టుదిట్టంగా, ఎక్కడా కాపీ జరగకుండా నిర్వహించాలని తెలిపారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించాలని, 6 ఫ్లయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయాలనీ సూచించారు. అన్ని కేంద్రాల వద్ద 163-బి సిఆర్ పిసి సెక్షన్ అమలు చేయాలని, జెరాక్స్ కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసి వేయాలని తెలిపారు. 11 రూట్ లను ఏర్పాటు చేసి రూట్ ఆఫీసర్లును నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాలతోపాటు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు, తాగు నీరు, పారిశుధ్యం ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ కమీషనర్లకు, డి.పి.ఓ కు ఆదేశించారు పరీక్షా కేంద్రాల వద్ద, స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు లను నిర్వహించి అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని డి.ఎం.హెచ్.ఓ కు సూచించారు.
ఈ సమావేశం లో అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డి.ఆర్.ఓ వి. విశ్వేశ్వరరావు, డి.ఈ.ఓ వెంకటలక్ష్మమ్మ, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, ఉప రవాణా కమీషనరు షేక్ కరీమ్, జిల్లా ఖజానా అధికారి టి. కృష్ణ, డి.ఎం.హెచ్.ఓ డా. ఆర్. మాలిని, ఆర్.టి.సి. డిఎం. బి. వాణి, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు, ఆర్.ఐ.ఓ , పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.