Close

పిజిఆర్ఎస్ దరఖాస్తులు రీ ఓపెన్ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కరించాలి – డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు సోమవారం పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు 306

Publish Date : 10/11/2025

ఏలూరు, నవంబర్, 10 : పిజిఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీ కి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు నిర్వహించారు. డిఆర్ఓ తో పాటు డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, ఎస్సి కార్పొరేషన్ ఇడి యం. ముక్కంటి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, సర్వే శాఖ ఏ డి అన్సారీ లు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ప్రతీ అర్జీని అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ రోజు పిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలలో కొన్ని .
ముదినేపల్లి మండలం శ్రీహరిపురమునకు చెందిన సీర్ల ఎలియబాబు తన దరఖాస్తులో తన పొలం పక్కన చేపల చెరువుకు అనుమతి తీసుకుని రొయ్యల చెరువు వేశారని, దీని కారణంగా తన పొలంలో పంటలు పంటడంలేదని, తనకు న్యాయం చేయవలసిందిగా తహసీల్దార్ ను కోరిన పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాలనీ కోరారు. ఏలూరు పడమరవీధికి కి చెందిన వినోద్ తమ ఇంటి పక్కనే మాంసం దుకాణం ఏర్పాటుచేశారని, దీనికరణంగా విపరీతమైన దుర్వాసన, కుక్కలు, ఎలుకలు చేరడంతో ఆ ప్రాంతంలోని నివాసులందరూ ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యం బారిన పడుతున్నారని తమకు న్యాయం చేయాలనీ కోరారు. ఏలూరు కొబ్బరితోట నివాసులు తమ ప్రాంతంలోని వినాయకుడి గుడి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిమిత్తం తవ్విన గోతులను మట్టితో పూడ్చారని, రోడ్డు పాడై తాము పడుతున్నామని, రోడ్డుకు మరమ్మత్తులు చేయాలనీ కోరారు. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన పరిమి సతీష్ మరియు ఇతర గ్రామస్థులు తమ దరఖాస్తులో మినీ గోకులం నిర్మాణం చేశామని, తమకు బిల్లులు చెల్లించలేదని, బిల్లులు చెల్లింపులు చేయవలసిందిగా కోరారు. ఏలూరుకు చెందిన ఒమ్మి కృష్ణారావు తమ దరఖాస్తులో తనకు 74 సంవత్సరాల వయస్సు అని, తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. సోమవారం పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు 306 వచ్చాయి.