పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ లలో వచ్చిన అర్జీలుపై శాశ్వత పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .
ఏలూరు, జూలై 06: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి డిఆర్వో ఎల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న లు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు అర్జీలుపై ప్రత్యేక శ్రద్ధపెట్టి, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించి, పిజిఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్‌లలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు నాణ్యమైన విధంగా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కారాలు ఉండాలని, అర్జీదారులు సంతృప్తి స్థాయిని మరింత పెంచాలని అన్నారు.
ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని.
టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన సిరిమళ్ళ వెంకటేశ్వరరావు మా గ్రామ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ 1.44 కోట్లకు పైగా ఎరువులు అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేపట్టాలని అర్జీని సమర్పించారు, ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన చల్లగుళ్ల నరేష్ కుమార్ పంట బొదేను పూడ్చివేశారని వారిపై చర్యలు తీసుకుని, పంట బొదేను తిరిగి ఏర్పాటు చెయ్యాలని కోరారు, పెదపాడు మండలం వట్లూరు గ్రామనివాసి షేక్ మహబూబ్ సుభాని ఇండ్లకు వెళ్ళే రహదారిని ఆక్రమించుకున్నారని విచారణ చేసి, యధాతధంగా తిరిగి రహదారిని ఏర్పాటు చెయ్యాలని కోరారు, జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామ నివాసి బెల్లంకొండ సుభాషిని ఇండ్ల నివాసాలు మధ్య వద్ద మేకలు పెంచుతున్నారని, దీనివల్ల దుర్వాసనతో పాటు పిల్లలు చదువు కునుటకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని, ఇబ్బందులు తొలగించాలని అన్నారు, మండవల్లి మండలం లింగాల గ్రామ నివాసి మారగాని సాంబశివ రావు డ్రైనేజీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.