Close

పిజిఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు ద్వారా అందిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి .

Publish Date : 31/08/2026

ఏలూరు, ఆగస్టు 31: జిల్లా కలెక్టరేటు గోదావరీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ( మీ కోసం) కార్యక్రమానికి జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీఫ్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవో లు కె.లక్ష్మీప్రసన్న, యం.వి.రమణ లు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా లబ్ధిదారులు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం అందించాల్సిన బాధ్యత అధికారులుపై ఉందని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి నిర్ణీత గడువులోపుగా పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని అన్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులుతో నేరుగా మాట్లాడి సమస్యలకు కారణాలను తెలుసుకుని, శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ప్రజలు మళ్లీ మళ్లీ అదే సమస్యతో అర్జీలు పెట్టాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ రోజు స్వీకరించిన అర్జీలలో కొన్ని.

టి.నరసాపురం మండలం మెట్టగూడెం గ్రామానికి చెందిన కుప్పాల సూర్యనారాయణ నాభూమిని ఆక్రమించుకుని పైగా దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చెయ్యాలని కోరారు, జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెంకు చెందిన కుంచె సీతాలావణ్య నాభర్త చనిపోయారని, నా ఆస్తిని కుమారుడు వ్రాయించుకుని నన్ను చూచుటలేదని తిరిగి నా ఆస్తిని ఇప్పించాలని, రేషన్ కార్డు, పింఛను మంజూరు చెయ్యాలని కోరారు, పోలవరం మండలం ప్రగడవల్లి గ్రామంకు చెందిన గరిసికూటి సురేంద్రనాధ్ 90 శాతం దివ్యాంగుడిని నాకు ఔట్సోర్సింగు పోస్టు ఇప్పించాలని కోరారు, ఏలూరు పడమరవీధి నివాసి బండుచోడే వెంకటరమణ వాటరు కనెక్షన్ కొరకు ధరఖాస్తు చేసినా చర్యలు తీసుకోలేదని, కాని వాటరు టాక్స్ చెల్లించమని మున్సిపల్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని, న్యాయం చెయ్యాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెంకు చెందిన పడాల సూర్యచంద్రరావు ఇంటిపన్ను డిమాండు నోటీసులో నా పేరు నమోదు లేదని పరిష్కారం చూపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.