పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీకి పారదర్శకత, నాణ్యతతో పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …
ఏలూరు,అక్టోబరు 13: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, కెఆర్ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర రావు, డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, జడ్పీ సిఇవో యం.శ్రీహరి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ, సర్వే ఏడి అన్సారీలు అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా అధ్యయనం చేసి తమ సిబ్బందితో నిర్ణీత గడువు లోపుగానే పరిష్కారం చూపాలన్నారు. ఒక్కోసారి ఫిర్యాదు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో స్వయంగా అధికారులు మాట్లాడాలని అన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెనువెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
ఈ రోజు పిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలలో కొన్ని.
దెందులూరు మండలం సానిగూడెంకు చెందిన తోట పోతురాజు నా పంట భూమికి రీ సర్వే చేయించి, ఆన్లైన్ చేయించాలని అర్జీ ఇచ్చారు, చింతలపూడి మండలం పొనుకుమాడు గ్రామానికి చెందిన చిట్టూరి రవీంద్రబాబు మా గ్రామంలో దేవుడి మాన్యం భూమిని కబ్జా చెయ్యాలని కొందరు నకిలీపత్రాలు సృష్టించి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి విచారణ చేసి న్యాయం చెయ్యాలని కోరారు, ముసునూరు మండలం గోపవరంకు చెందిన కె.వెంకటేశ్వరమ్మ నా భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలుతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఏ బ్యాంకులో ఏటువంటి ఋణాలు లేవు కాని జాతీయ బ్యాంకులో మూడు రకాలు ఋణాలు ఉన్నాయని బ్యాంకు నుండి కబురు చేశారు. విచారణ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరారు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంకు చెందిన వీరంకి సురేష్ ఆర్ & ఆర్ ప్యాకేజీలో నాపేరుకు బదులు వేరేవారికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది, విచారణ చేసి నాకు పరిహారం ఇప్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.