పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
వేలేరుపాడు/ ఏలూరు, నవంబర్, 1 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడులో శనివారం పండుగ వాతావరణం లో జరిగిన సభలో రూ. 1000 కోట్లు నిర్వాసితులకు మంత్రి పంపిణీ చేశారు. ఇందుకు సంబందించిన మెగా చెక్ ను నిర్వాసిత కుటుంబాలకు అందజేశారు. నిర్వాసితులకు భూసేకరణ, మరియు పునరావాసం పరిహారం నగదును బ్యాంకు ఖాతాలలో జమ చేసే కార్యక్రమం పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు నిర్వాసితులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడారు. చారిత్రక పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి త్యాగధనులైన నిర్వాసితులందరికీ పరిహారం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు కొండంత అండగా నిలిచిన పవన్ కళ్యాణ్, వీరికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతునిచ్చిన ప్రధానమంత్రి మోదికి మనమంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని పిలుపునిచ్చారు. నాడు నేడు కూడా చంద్రన్న హయాంలోనే నిర్వాసితులకు న్యాయం జరిగిందని రామానాయుడు స్పష్టం చేశారు. అందులో భాగంగానే 2016 లో రూ. 700 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన సంగతిని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరిలో 900 కోట్లు ఇచ్చిన సంగతి మీకు తెలుసు అన్నారు. ఇప్పుడు
రెండోసారి 1000 కోట్లు మీ ఖాతాల్లో జమవుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో కూడా నిర్వాసితులందరినీ
కూటమి ప్రభుత్వం నిండు మనసుతో ఆదరిస్తుందన్నారు. మీకు అండగా నిలబడుతుందన్నారు.
గత 5ఏళ్ళ వైసిపి పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారన్నారు. నిర్వాసితులందరినీ గాలికి వదిలేశారని, . ఆశ్రయం కోల్పోయిన మీరందరూ వరదల సమయంలో పడ్డ అష్ట కష్టాలు మా అందరికీ తెలుసన్నారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే.. 2019- 24 మధ్య వైకాపా అరాచక ప్రభుత్వం రెండు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది అన్నారు. పోలవరం నిర్మాణ ప్రగతిని పాతికేళ్ళు వెనక్కి నెట్టేసింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణం గాడిలో పెట్టడంతో పాటు, ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులైన మీ అందరికీ అండగా నిలబడ్డ సంగతి గుర్తించాలన్నారు. అన్యాయం చేసిన వైకాపా పార్టీని , జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం మీరు గుర్తు ఎరగాలన్నారు. నాడు జగన్ పాలనలో నిర్వాసితులు తమను తెలంగాణాలో కలిపేయమని రోడ్డెక్కి అందోళన చేసిన పరిస్దితిని మంత్రి గుర్తు చేశారు. ఐదేళ్ల వైసిపి పాలనలో పునరావాస కాలనీల నిర్మాణానికి ఒక్క బస్తా సిమెంట్ పని గానీ, నిర్వాసితులకు ఒక్క రూపాయి నష్టపరిహాం గానీ ఇవ్వలేదని మంత్రి దుయ్యబట్టారు. 2014-19 సమయంలో తమ టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.3385 కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం 2019-24 సమయంలో రియంబర్స్మెంట్ చేసిందని, ఆ నిధులను కూడా, ప్రాజెక్టు నిర్మాణానికి గానీ, నిర్వాసితులకు గానీ, అందించకుండా గత ప్రభుత్వం దారి మళ్లించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఫేజ్ 1 కింద 41.15 మీటర్ల కాంటూరులో, 2026 జూన్ నాటికి సహాయ, పునరావాసం,ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పునరావాసం, కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ. 739 కోట్లతో ఇటీవలే టెండర్లు పూర్తయ్యాయని ప్రకటించారు. ప్రస్తుతం 75 నిర్వాసిత కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయన్నారు. సమాంతరంగా మౌలిక సదుపాయాలు కూడా కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. తొలిదశ ఆర్అండ్ఆర్ 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూసేకరణ, పరిహారం విషయం లో దళారుల పాత్ర ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అందుకు ఆరు నెలలు ముందే ఫేజ్ -2 నిర్వాసితుల పరిహారం తదితర సమస్యలు పరిష్కరిస్తామని రామానాయుడు స్పష్టం చేశారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ నిర్వాసితులకు పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాలలోనికి నేరుగా జమచేస్తున్నదన్నారు.
పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు భూములను అందించిన ప్రతి ఒక్క నిర్వాసితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.
రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమీషనర్ ప్రశాంతి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహామూర్తి, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ డా. అభిషేక్ గౌడ్, రాష్ట్ర జలవనరుల శాఖ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, జెడ్పి సీఈఓ శ్రీహరి, బిజెపి రాష్ట్ర నాయకురాలు నిర్మల కిషోర్, ఎంపిపి లక్ష్ష్మి దేవి, జెడ్పిటిసి రామలక్ష్మి, సర్పంచ్ వెంకటమ్మ, ప్రభృతులు పాల్గొన్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు ను వేలేరుపాడు నుండి సభాస్థలి వరకు గిరిజన సాంప్రదాయ నృత్యం ధింసా నృత్యం ఘనంగా స్వాగతం పలికారు.