Close

పోలింగ్ కు సర్వసన్నద్ధం కావాలి.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించుకోవాలి..

Publish Date : 24/02/2025

ఏలూరు, ఫిబ్రవరి, 24: ఉమ్మడి తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఈనెల 27వ తేదీన జరుగనున్న పోలింగ్ ఏర్పాట్లకు సంబంధిత అధికారులు సర్వసన్నద్ధం కవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్ధానిక గౌతమీ సమావేశ మందిరంలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల,ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. చెక్ లిస్టు ప్రకారం ఎన్నికల సామాగ్రి పంపిణీ పకడ్బందీగా జరగాలని ఒకటికి రెండుసార్లు అన్ని పరిశీలించుకోవాలన్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి రెండు విడతల శిక్షణ అందించడం జరిగిందన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ, వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. రిసెప్షన్ సెంటర్ వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక ఎక్యూప్ మెంట్ ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. స్ట్రాంగ్ రూం కు మూడు అంచెల భధ్రత ఏర్పాటు చేయాలన్నారు. ఓటు వేయడంపై కూడా ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి రోజూవారీ వచ్చే పోస్టల్ బ్యాలెట్లను ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూంలో భధ్రపర్చాలన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకాలను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1950 నెంబరుకు తెలియపర్చవచ్చన్నారు. మద్యం, నగదుపంపిణీ వంటి చర్యలకు పాల్పడితే సమాచారం అందించాలన్నారు. ఈఎన్నికలకు సంబంధించి 456 పోలింగ్ కేంద్రాలకు 71 జోన్లకు జోనల్ అధికారులను, 99మంది రూట్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రిసెప్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడ ఎన్నికల సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు తోపాటు పలువురు ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.