Close

ప్రజలు దగ్గరకు నేరుగా వెళ్ళి అర్జీలను స్వీకరించి అధ్యయనం చేసి, అర్జీదారులకు భరోసానిచ్చిన – జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..

Publish Date : 02/03/2026

ఏలూరు, మార్చి 02: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జిల్లా స్థాయీ అధికారులతో నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, కెఆర్ సీసీ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటి లు స్వీకరించారు. ప్రజలు దగ్గర నుండి అర్జీలను స్వీకరించి, నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కారం చేస్తామని వారికి భరోసానిచ్చి, వేసవి దృష్ట్యా త్వరితగతిన ప్రజలను తిరిగి ఇంటికి పంపించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టరు ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో అందిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్జీలు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తిని చెందే విధంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని.

దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పర్వతనేని రంగారావు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మంచి సేవలు అందించారని,అలాగే పెసలు, మినుము, తదితర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రాలు పెట్టాలని కోరారు, ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ పామాయిల్ పెంపకానికి బోరు వేసుకునుటకు రుణం మంజూరు చెయ్యాలని కోరారు, చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ నివాసి కనుమతరెడ్డి జగన్మోహన్ రెడ్డి పంట పొలాలకు రహదారి కబ్జాకు గురైందని, విచారణ చేసి రాకపోకలకు రహదారి ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చెయ్యాలని కోరారు, భీమడోలు మండలం దుద్దెపూడి గ్రామ నివాసి పూని ధశరద రామారావు అంబేద్కర్ కాలనీకి డ్రైనేజీ సదుపాయం లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుచున్నామని, డ్రైనేజీ ఏర్పాటు చెయ్యాలని కోరారు, కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామ నివాసి పుట్టా రామలక్ష్మి అసంపూర్తిగా మిగిలి పోయిన ఇల్లును పూర్తి చేసుకునుటకు రుణం మంజూరు గాని సాయం గాని అందించగలరని కోరారు. రెవిన్యూ క్లినిక్ లు మండలాలు వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి అర్జీలను స్వీకరించారు. వీటిలో భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, రీ సర్వే తిరిగి చెయ్యాలని, తదితర ఇతర భూసమస్యలు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి. నాంచారయ్య, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.