ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలలో అధికారులు పరిష్కరించిన అర్జీలకు సంబంధించి అర్జీదారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం సాయంత్రం నేరుగా ఫోన్ చేసి వారి దరఖాస్తు పరిష్కార విధానం, అధికారుల క్షేత్రస్థాయిలో చేసిన విచా
ఏలూరు, మే, 2 : ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలలో అధికారులు పరిష్కరించిన అర్జీలకు సంబంధించి అర్జీదారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం సాయంత్రం నేరుగా ఫోన్ చేసి వారి దరఖాస్తు పరిష్కార విధానం, అధికారుల క్షేత్రస్థాయిలో చేసిన విచారణలు, అర్జీదారులతో ప్రవర్తన, ప్రజల అభిప్రాయాలను కలెక్టర్ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. నూజివీడు ఎం.ఆర్. అప్పారావు కాలనీకి చెందిన కె. వేణుగోపాల్ తన అర్జీలో తన భూమిని గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం సేకరించిందని , కానీ తాను కోర్ట్ కు వెళ్లగా కోర్ట్ స్టే విదించిందన్నారు. దాంతో గత ప్రభుత్వం తన భూమిని 22 ఏ నిషేదిత భూముల జాబితాలో చేర్చారన్నారు. తన అర్జీపై నూజివీడు సబ్ కలెక్టర్ తన భూమి ల్యాండ్ సీలింగ్ భూమి అని, పిఓటి ఆక్ట్ వయోలేషన్ కింద సదరు భూమి అన్యాక్రాంతం అయినందున 22ఏ జాబితా నుండి తొలగించేందుకు వీలుపడదని తెలియజేశారన్నారు. కుక్కునూరు మండలం మారేడుబాక గ్రామానికి చెందిన ఎం. శ్రీదేవి తన అర్జీలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అందించే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పరిహారం అధికంగా అందిస్తామని అమాయక గిరిజనులను కొందరు దళారులు మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఫిర్యాదు చేయగా, దీనిపై స్పందించిన అధికారులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పరిహారంలో ఒకసారి తుది నిర్ణయం జరిగిన తరవాత పెంచడం, మార్చడం సాధ్యం కాదని, కావున ప్రజలు ఇటువంటి ప్రచారాలు నమ్మి మోడపోవద్దని పలుమార్లు పత్రికల ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. కుక్కునూరు మండలం మాదారం కు చెందిన బి. వెంకటేశ్వరరావు తన అర్జీలో దామరచర్ల లో నిర్వాసితులకు నిర్మించే కాలనీలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుచేయవలసిందిగా కోరగా, సదరు విషయాన్నీ విజయవాడలోని ఆర్ అండ్ ఆర్ కమీషనర్ మరియు ఐటిడిఏ వారికి తెలియజేయడం జరిగిందని, వారి సూచనల మేరకు తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారన్నారు. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామానికి చెందిన తన భూమిని కొందరు ఆక్రమణకు గురిచేశారని, తనకు న్యాయం చేయాలనీ కోరగా, జిల్లా కోర్ట్ లో దరఖాస్తు చేసుకున్నందున, కోర్ట్ వారి తుదితీర్పు ననుసరించి చర్యలు తీసుకోగలమని తెలియజేసారని తెలిపారు. కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన సిహెచ్. సూర్యకుమారి తన అర్జీలో తన భూమిని కొందరు ఆక్రమణకు గురిచేశారని, తనకు న్యాయం చేయాలనీ కోరగా, సదరు భూమికి సంబందించిన ఆధారాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించిన ఎడల పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు అందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యను సవివరంగా తెలుసుకుని నిబంధనల మేరకు ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీల పరిష్కారం విధానాన్ని అర్జీదారులతో నేరుగా ఫోన్ ద్వారా తెలుసుకుంటానని, పరిష్కార ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నదని తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.