Close

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.- అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం

Publish Date : 26/11/2024

ఏలూరు, నవంబర్, 26 : లోకాయుక్త , కోర్టుల ద్వారా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా అందిన కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. . స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం లోకాయుక్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కేసుల పరిష్కారం, రీసర్వే పై అందిన అభ్యంతరాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ లోకాయుక్త , కోర్టుల ద్వారా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా అందిన కేసుల పరిష్కారంలో కొందరు అధికారులు చేసే నిర్లక్ష్యం కారణంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు లోకాయుక్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ల ముందు వ్యక్తిగత హాజరు కావలసి వస్తుందన్నారు. లోకాయుక్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా అందిన కేసుల పరిష్కారంపై ప్రతీ వారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులతో సమీక్షించుకుని, ముందుగా ప్రాధమిక నివేదిక అందించేలా చర్యలు తీసుకోవాలని, తుది నివేదికను కూడా కేసు హియరింగ్ లోగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదని, నిర్దేశించిన సమయంలోగా స్పందించని అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతో పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న దృష్ట్యా,. ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయవలసి ఉంటుందన్నారు. జిల్లాలో ఇరిగేషన్ కాలువలు, డ్రైనేజీలు, పంచాయతీ, ఆర్ అండ్ బి రోడ్లు, ఆక్రమణలపై సవివరమైన నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా మండల పరిధిలో ఇరిగేషన్ కాలువలు, డ్రైనేజీలపై నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలపై వెంటనే నివేదిక అందించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డి ఎస్ ఓ ఆర్. సత్యనారాయణరాజు, పౌర సరఫరాలశాఖ డి ఎం శ్రీలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.