Close

ప్రజా సమస్యలు నాణ్యతతో పరిష్కారం చూపాలి.. పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో వచ్చిన అర్జీలు 289 జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 01/06/2026

ఏలూరు,జూన్,01 : ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతీ అర్జీని నాణ్యతతో సకాలంలో పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ హాలులో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జాయింట్ కలెక్టర్ యు.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ ఎల్. దేవకీదేవి, ఏలూరు ఆర్డిఓ కె. లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటిలు అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో అందిన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్ధాయిలో పరిశీలన చేసి నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలన్నారు. సోమవారం పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో 289 అర్జీలు అందాయని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రజల నుండి అందిన అర్జీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
అందిన అర్జీలలో కొన్ని..
జంగారెడ్డిగూడెంకు చెందిన యాసారపు నూకరత్నం మ్యూటేషన్, ఆన్ లైన్ చేయించి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు. చింతలపూడి మండలం ప్రగడవరంకు చెందిన జమ్మిశెట్టి బాబూరావు అర్జీనిస్తూ 50ఏళ్లకు పైగా ఉన్న పుంతదారిని మూసివేయకుండా తగుచర్యలు తీసుకుని రైతులకు మేలుచేయాలని కోరారు. జంగారెడ్డిగూడెమండలం వేగవరంకు చెందిన నెల్లూరి చంద్రశేఖర్ అర్జీనిస్తూ భూమిని రీ సర్వే చేసి ఆన్ లైన్ నమోదు చేయాలని కోరారు. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రుకు చెందిన సైదు దుర్గా అర్జీనిస్తూ చేపలచెరువును సర్వేయించి హాద్దులు నిర్ణయించాలని కోరారు. బీమడోలు మండలం పూళ్లకు చెందిన బొల్లారపు బాస్కరరావు అర్జీనిస్తూ రోడ్డుమీద మట్టి, కంకర పోసి చాలా రోజులైయిందని, రోడ్డు పనులు చేపట్టకపోవడం వల్ల వర్షం వచ్చినపుడు ఇబ్బందిగా ఉందని దానిని పరిష్కరించాలని కోరారు.
కార్యకమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ ఎన్.వి. నాంచారయ్య, కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.