ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .
ఏలూరు, మే, 18 : పిజిఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీలు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు నుండి అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖలు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, ధరఖాస్తుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. అర్జీదారులు కార్యాలయాలు చుట్టూ తిరగకుండా, వారికి సంతృప్తి కలిగే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే, దానికి గల కారణాలను లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంటు ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని, సమస్యలు పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులకు శాఖా పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో వచ్చిన అర్జీలు 246 స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.
అందిన అర్జీలలో కొన్ని….
ఏలూరు శనివారపుపేట కు చెందిన కోరుకొండ శ్రీనివాసరావు తన దరఖాస్తులో తమ ఇంటికి వెళ్లే దారిని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆక్రమణ చేసి గోడను నిర్మించారని, సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.. పెదవేగి మండలం అమ్మపాలెంనకు చెందిన ఎన్. కాంతారావు తన దరఖాస్తులో తమ ఇంటి స్థలంలో పక్కవారితో సరిహద్దు సమస్యలు ఉన్నాయని పరిష్కరించాల్సిందిగా కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. . నిడమర్రు మండలం గుణపర్రు గ్రామానికి చెందిన ఐ.వి.ఎస్. రంగమన్నారు తన దరఖాస్తులో తమ గ్రామంలో అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, నిలుపుదల చేయవలసిందిగా కోరగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. కామవరపుకోటకు చెందిన జి. సత్యనారాయణ తన దరఖాస్తులో కామవరపుకోటలో కోటగట్టు కాల్వపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలియజేయగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ని కలెక్టర్ ఆదేశించారు. కామవరపుకోటకు చెందిన తమ గ్రామంలో పంచాయతీ అధికారులు ఆక్రమణదారులను సమర్దిస్తున్నారని, ఆక్రమణలు తొలగించాలని కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ ని కలెక్టర్ ఆదేశించారు. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము గ్రామానికి చెందిన కె. పుల్లమ్మ తన దరఖాస్తులో తన 3 ఎకరాల భూమిని పోలవరం ప్రాజెక్ట్ కు అందించానని, పునరావాస ప్యాకేజి అందించాలని కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని భూసేకరణల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు.
వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.