ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలపట్ల ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచే విధంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు.
ఏలూరు, మే, 18 : ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలపట్ల ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచే విధంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిలపై జిల్లాల కలెక్టర్లు, మండల, గ్రామ స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రతీ సంక్షేమ పధకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆశయమన్నారు.
ప్రభుత్వం సేవలపట్ల ప్రజలు సంతృప్తి చెందినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని, ప్రభుత్వ ఆలోచనను ప్రతీ అధికారి, సిబ్బంది అర్ధం చేసుకుని ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలోని ప్రజల వద్దకు తీసుకువెళ్లి, ఆ సేవలపట్ల వారు సంతృప్తి చెందేలా పనిచేయాలన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, వివిధ శాఖల అధికారులు టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.