ఫిర్యాదుల నమోదుకై ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ గురించి 18004256131 విస్తృత ప్రచారం చేయాలి
ఏలూరు, ఫిబ్రవరి, 12 : జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసి అండ్ పిఎన్డిటి) అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. పుట్టబోయేది ఆడ శిశువు అని తెలియగానే కొన్ని సందర్భాల్లో గర్భస్రావానికి సిద్ధ పడుతున్నారని ఇది చాలా బాధాకరం అని, ఇటువంటి సంఘటనలు రూపు మాపడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం తీసుకు వచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో 13, ప్రైవేట్ విభాగంలో 102 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిల్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ జరగకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. ఏ కేంద్రంలోనైనా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ జరిగినట్లు తేలితే తగిన ఆధారాలతో ఆయా కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ, ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖాధికారులు పోలీసు అధికారుల సహకారంతో పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని సరైన పరికరాలతో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. గర్భ విచ్చిత్తి ఔషదాలు ఔషధ దుకాణాలలో విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో లేకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కేసు కేంద్రాలపై ఫిర్యాదుల కోసం జిల్లాలో టోల్ ఫ్రీ 18004256131 ఫోన్ నెంబర్ ఏర్పటుచేయడం జరిగిందని, టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలందరికీ తెలిసేలా ప్రతీ స్కానింగ్ సెంటర్ వద్ద ప్రదర్శించాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, సదరు స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం జిల్లాలో 1499 అబార్షన్స్ నమోదయ్యాయని, వీటిపై స్కానింగ్ కేంద్రాలు, మండల, గ్రామాల వారీగా వివరాలు అందించాలని, వీటిపై సమగ్ర విచారణ చేయాలన్నారు. ఏలూరు జిలాల్లో స్త్రీ, పురుష నిష్పత్తి 934, 1000 గా ఉందని, ఇది ఆందోళనకరమైన విషయమన్నారు. జిల్లాలో డేకాయ్ ఆపరేషన్లు నిర్వహించి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టం పటిష్టంగా అమలు పరిచి, జిల్లాలో స్త్రీ నిష్పత్తిని గణనీయంగా పెంచుటకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. .
సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ ఎస్ డా. బి.పాల్ సతీష్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.యు.శోభ, ఐసిడిఎస్ పిడి పి.శారద, డెమో శ్రీనివాసరావు, డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చక్రవర్తి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి, డ్రగ్ ఇన్స్పెక్టర్, కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.