బంక్ ల వద్ద సిబ్బందిని నియమయించి డీజిల్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి వరి కోత యంత్రాలకు ఏ రోజు వినియోగిస్తే ఆరోజు టోకెన్లు అందించాలి డీజిల్ సమస్యపై అధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్
ఏలూరు, ఏప్రిల్, 28 : బంక్ ల వద్ద డీజిల్ పక్కదారి పట్టకుండా సిబ్బందిని నియమించి డీజిల్ సక్రమంగా సరఫరా అయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. డీజిల్ కొరతపై మంగళవారం అధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వివిధ ఆయిల్ కంపెనీల నుండి ట్యాంకర్లు మంగళవారం మధ్యాహ్నానికి ఇండెంట్ పెట్టిన బంక్ లకు చేరుకుంటున్నాయని, బంక్ ల నుండి డీజిల్ సక్రమంగా సరఫరా జరిగేలా ప్రతీ బంక్ దగ్గర సిబ్బందిని నియమించి పర్యవేక్షించాలన్నారు. బంక్ లలో డీజిల్ నిల్వలు పరిశీలించి, రికార్డ్ లలో తెలియజేసిన నిల్వలలో లోటుపాట్లు ఉన్నా, అధిక ధరలకు అమ్ముతున్నా, డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు పెడుతున్న తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో గత వారం సాధారణ వినియోగం కంటే 200 శాతం అధికంగా డీజిల్ ను అందుబాటులో ఉంచినప్పటికీ సోషల్ మీడియా ద్వారా డీజిల్ కొరత ఉందంటూ వదంతులు వ్యాప్తి చెందడంతో డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనని ఆందోళనతో పానిక్ కొనుగాళ్లకు ప్రజలు ప్రయత్నిస్తున్నారని, దీనికారణంగా సమస్య ఏర్పడుతుందన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రజల అవసరాలకు సరిపడా డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలన్నారు.
వ్యవసాయానికి హార్వెస్టింగ్ యంత్రాలు వినియోగించే వారికి ఏ రోజు వినియోగిస్తున్నారో తెలుసుకుని అదే రోజుకు డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా ఆక్వా రైతులకు కూడా సమస్య లేకుండా డీజిల్ అందేలా చూడాలన్నారు. డీజిల్ కొరతపై ఫిర్యాదులను కంట్రోల్ రూమ్ 7569296272 నంబర్ కి ఫిర్యాదు చేసేలా ప్రజలలో అవగాహన పెంచాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు కిషోర్, రమణ, డిఎస్ఓ బాబు విలియమ్స్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా , మత్స్య శాఖాధికారి రాజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.