Close

బాలల దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 14/11/2024

ఏలూరు, నవంబర్, 14: బాలలకు సురక్షితమైన, సంతోషకరమైన భవిష్యత్ ను అందించడం ద్వారా బాధ్యతగల పౌరులుగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్ధానిక ఈదర సుబ్బమ్మదేవి నగర బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిన్నారులతో కలిసి జ్యోతి ప్రజ్వలనచేసి బాలల దినోత్సవం-బాలల హక్కుల దినోత్సవాన్నికలెక్టర్ ప్రారంభించారు. అనంతరం పలువురు విద్యార్ధినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. బాలల దినోత్సవం సందర్బంగా బాలలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషిచేస్తుందన్నారు. కష్టపడి, ఇష్టపడి చదవడం ద్వారా విజయం అందిపుచ్చుకోవచ్చని విద్యార్ధులకు ఆమె హితవు పలికారు. చదవుతోనే వ్యక్తిత్వం, సామాజిక అభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి సాధించగలమన్నారు. విద్యార్ధి దశలో 10వ తరగతి పునాదిలాంటిదని ఈ సమయంలో విద్యపై అశ్రద్ధ చేయకుండా చదువుపైనే తమ మనస్సు ఉంచాలన్నారు. క్రమశిక్షణ అంకితభావంతో ఎంతటి ఉన్నతస్ధాయికైనా ఎదగవచ్చన్నారు. తమకు నచ్చిన సబ్జెక్ట్ లను ఎంచుకొని అందుకు అనుగుణంగా భవిష్యత్ లక్ష్యాలను నిర్ధేశించుకోవాలన్నారు. విద్యతోపాటు మంచి పుస్తకాలను చదవడం, అదే విధంగా ఏదోఒక క్రీడారంగంపై అభిరుచి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక స్ధైర్యం, శారీరక ధృఢత్వం వంటి ఎన్నోరకాల ప్రయోజనాలు కలుగుతాయన్నారు. బాలికల సంరక్షణలో గతంలోకన్నా ప్రస్తుతం ఎన్నో రక్షణ చర్యలు కల్పించబడ్డాయన్నారు. తమకు ఏదైనా ఆపద సంభవించిన సమయంలో 1098 కి ఫోన్ చేస్తే అవసరమైన రక్షణ చర్యలు తీసుకోబడతాయన్నారు.

రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ సభ్యులు జె. రాజేంధ్రప్రసాద్ మాట్లాడుతూ బాలల హక్కులను సక్రమంగా అమలు చేసేందుకు కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ -2005 చట్టాన్నిఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా బాల బాలికల రక్షణ, సంరక్షణకు ఎన్నో చర్యలు తీసుకోబడ్డాయన్నారు. బాల బాలికల రక్షణకోసం బాలల న్యాయరక్షణ, సంరక్షణ, బాలలపై లైంగిక వేధింపుల నిరోధక, బాలలకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు, ఇతర చట్టాలు తీసుకురాబడ్డాయన్నారు. బాలబాలికలు చదువుపైనే శ్రద్ధచూపాలన్నారు. అనవసరమైన ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టవద్దని హితవు పలికారు.

కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, డిసిపివో సిహెచ్. సూర్యచక్రవేణి, జిల్లా బాలికాభివృద్ధి అధికారి నజియా సుల్తానా, పలువురు విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.