భద్రాచలం వద్ద గోదావరి నదికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరు, సెప్టెంబర్, 30 : గోదావరి నదికి భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయిన దృష్ట్యా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు , గజఈతగాళ్లను సిద్ధం చేయాలనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంపు ప్రమాదం ఉండే ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్దులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని, విభిన్న ప్రతిభావంతులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీలను దగ్గరలోని సిహెచ్సి లకు తరలించాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కాజ్ వే, కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని, ప్రజలు ప్రయాణించకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నదులు, కాలువలు, చెర్వులలోనికి స్నానం, చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. వరదల సమయంలో విద్యుత్ స్థంబాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సంసిద్ధత చర్యలు తీసుకోవాలని, వరద పునరావాస కేంద్రాలలోను, సహాయక చర్యలు తీసుకొనే ప్రదేశంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని, జెనరేటర్లు ఏర్పాటుచేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాలలో ముఖ్యంగా కొండ ప్రాంతాలలో నివసించే వారికి నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ముంపు ప్రాంతాలలో ముఖ్యంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో సిద్ధం చేయాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా గోదావరి నదీ తీరప్రాంత ప్రజలు అధికారులతో సహకరించి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.