మంగళవారం ఉదయం నాటికి డీజిల్ లేని బంకులకు డీజిల్ సరఫరా జిల్లాలో డీజిల్ కొరత లేకుండా మామూలు పరిస్థితికి తీసుకువస్తాం
ఏలూరు, ఏప్రిల్, 27 : జిల్లాలో డీజిల్ సమస్యకు మంగళవారం ఉదయం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి కలెక్టర్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 232 పెట్రోల్, డీజిల్ రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయని, వాటిలో డీజిల్ అయిపోయిన బంకు లకు మంగళవారం ఉదయం లోగా పూర్తి స్థాయిలో సరఫరా చేసి జిల్లాలో డీజిల్ కొరత లేకుండా మామూలు పరిస్థితికి తీసుకువస్తామని చెప్పారు. జిల్లాలో రోజుకు సగటున 350 కిలోలేటర్ల వినియోగం ఉండగా, ప్రస్తుతం 500 కిలోలీటర్ల వరకు కొనుగోలు చేస్తున్నారని, జిల్లాలో డీజిల్ కొరత ఉంటుందన్న సామజిక మాధ్యమాలలో శనివారం అవాస్తవాలు వ్యాప్తి చెందడం కారణంగా ఆందోళనతో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసారని, ఆ కారణంగా జిల్లాలో డీజిల్ సరఫరా సమస్య కలిగిందన్నారు. ప్రస్తుతం 600 కిలోలేటర్ల వరకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం అయినప్పటికీ ఆయిల్ కంపెనీల వారితో మాట్లాడి కొంతమేర ఆయిల్ సరఫరా చేయించడం జరిగిందన్నారు. డీజిల్ పూర్తిగా అయిపోయిన బంక్ లను గుర్తించి సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం నాటికి సదరు బంక్ లలో పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుని సాధారణ పరిస్థితికి తీసుకువస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితిని అనుకూలం చేసుకుని డీజిల్ ని దారిమళ్లించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. డీజిల్ సమస్యలు తెలియజేసేందుకు కలెక్టరేట్ లో 7569296272 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఎక్కడైనా రబీ ధాన్యం సరఫరా వాహనాలకు , ఆక్వా రైతులకు డీజిల్ సమస్య ఉన్నట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చన్నారు. జిల్లాలో రబీ ధాన్యం రవాణా, ఆక్వా రైతులకు, అత్యవసర వైద్య వాహనాలకు తహసీల్దార్లు, రైతు సేవా కేంద్రాల ద్వారా 432 అనుమతులు మంజూరు చేసి, 12 వేల లీటర్లు అందించడం జరిగిందన్నారు. ప్రజలు పానిక్ కొనుగోళ్లు చేయకుండా అందరూ చూడాలన్నారు. ఆర్టీసీ సర్వీసులకు ఎటువంటి డీజిల్ కొరత లేదని, వారికి గారేజ్ లలో ప్రత్యేకంగా బంక్ లు ఉంటాయని, వాటికి అవసరమైన డీజిల్ ను ఆయిల్ కంపెనీల వారు సరఫరా చేస్తున్నారన్నారు. ఆక్వా పరిశ్రమకు సంబంధించి విద్యుత్ సరఫరా సమస్యలను 30 ని.లలో పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిందిగా కోరడం జరిగిందన్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ అవసరానికి మించి డీజిల్ కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటే ప్రస్తుత వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున ప్రజలు వారికి అవసరాల మేరకే కొనుగోలు చేయాలన్నారు. పానిక్ డీజిల్ కొనుగోళ్లు చేయకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తో మాట్లాడి ప్రజలు పానిక్ కొనుగోళ్లు చేయకుండా కోరడం జరిగిందన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ట్రైనీ కలెక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, డిఎస్ఓ బాబు విలియమ్స్, ప్రభృతులు పాల్గొన్నారు.