మహాశివరాత్రి ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి..
ఏలూరు, ఫిబ్రవరి,25: జిల్లాలోమహాశివరాత్రి ఉత్సవాలు, పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ విసి హాలు నుంచి జిల్లాలోని తహశీల్దార్లు, పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మహాశివరాత్రి ఏర్పాట్లు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, తీసుకోవల్సిన జాగ్రత్తలపై దిశా, నిర్ధేశం చేశారు. పోలవరం మండలం పట్టిసం లో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగుకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. స్నానఘట్టాల వద్ద,క్యూలైన్లు వద్ద రెవిన్యూ, పోలీసు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. భక్తులకు కల్పించిన ఏర్పాట్లు, సౌకర్యాలకు సంబంధించిన తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదికను పంపాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయడానికి నిర్వహించుకున్న సమన్వయ కమిటీలో తీసుకున్న అంశాలను మరోసారి సమీక్షించుకోవాలన్నారు. స్నానఘట్టాల వద్ద గజఈతగాళ్లను పకడ్బందీగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యసేవలకు సంబంధించి మెడికల్ ఆఫీసర్లు ఉత్సవాలు పూర్తయ్యేవరకు విధులను బాధ్యతగా నిర్వహించాలని మరిముఖ్యంగా పాముకాటుకు సంబంధించిన మెడికల్ కిట్ ను సిద్ధంగా ఉంచాలన్నారు. ఉత్సవాల నిర్వహణపై ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్నిచోట్ల భక్తులకు వినిపించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కంట్రోల్ రూంలో విధులు నిర్వహించే అధికారులు ఉత్సవాలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, పోలీసు వారు ఫోన్ నెంబర్లు సిద్ధం గా ఉంచుకోవాలన్నారు. తహశీల్దార్లు మేజిస్ట్రీట్ హోదాలో పర్యవేక్షణ చేపట్టాలని ఉత్సవ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పర్యవేక్షించుకోవాలని ఆదేశించారు.
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో ఎన్నికల నిర్వహణకు కేటాయించిన అధికారులు, సిబ్బంది ఎన్నికల సామాగ్రి పంపిణీ నుంచి ఓటింగ్ పూర్తయ్యేవరకు వారి విధులలో జాగ్రత్తలు పాటించి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎన్నికల కమీషన్ నిబంధనలు మేరకు పోలింగ్ బూత్ ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులకు తెలియపర్చి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు.
సమావేశంలో జిల్లా ఎస్పీ కె.పి.ఎస్.కిషోర్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్బంగా పట్టిసం, బలివే లో పటిష్టమైన పోలీసు బంధోబస్తు ఏర్పాటు చేయడమైనదన్నారు. సంబంధిత సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దైవదర్శనానికి సంబంధించి క్యూలైన్లు బ్రేక్ లేకుండా సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. విఐపిల దర్శనానికి ప్రత్యేకమైన క్యూలైన్ల ద్వారా పంపించాలన్నారు. సామాన్య భక్తులకు దర్శనం ఆగకుండా చూడాలన్నారు. స్నానఘట్టాల వద్ద, వాహనాల పార్కింగ్ ల వద్ద, గుడివద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు పర్యవేక్షించుకోవాలని పోలీలు అధికారులను ఆదేశించారు. అత్యవసరమైన అంబులెన్స్, అగ్నిమాపక వాహనం, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సంబంధిత అధికారుల ఫోన్లు ద్వారా వ్యక్తిగతంగా ఉపయోగించుకోకుండా విధులకు సంబంధించిన సమాచారానికి ఎటువంటి ఆటంకం లేకుండా మొబైల్ ఫోన్లు చార్జింగ్ తో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్ధితులను అధికారులు పర్యవేక్షిస్తూ క్రింది ఉద్యోగులకు తగు సూచనలు జారీచేయాలని చెప్పారు. రెవిన్యూ, పోలీసు ఇతర శాఖల అధికారులతో మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విధులు కూడా నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పనిచేయాలని సూచించారు.