మాతా, శిశు మరణాల నివారణపై అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరు, ఫిబ్రవరి, 12 : జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్యులు, ఐసిడిఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక గౌతమీ సమావేశపు హాలులో గురువారం మాతా, శిశు మరణాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అధికారులు, వైద్యులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 3 మాతృ మరణాలు, 36 శిశు మరణాలు సంభవించాయని, జరిగిన ప్రతీ మరణంపై సవివరమైన మెడికల్ ఆడిట్ జరగాలన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి వైద్య సిబ్బంది కారణంగా మరణాలు సంభవించాయని తేలితే సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు నివారించడంలో భాగంగా గర్భిణీల ఆరోగ్య పరిరక్షణపై గైనకాలజిస్ట్ లు పీడియాట్రిషియన్స్ తో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులకు దీర్ఘకాలిక వ్యాధులు, రక్తహీనత, డయాబెటిస్, బిపి, తదితర ఆరోగ్య పరీక్షలను ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ముందుగానే చేయించి, అందుకుతగిన విధంగా చికిత్స అందేలా చూడాలన్నారు. ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ముందునుండే గర్భిణీ ఆరోగ్యపరిరక్షణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరివరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుండే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ గర్భవతి అయితే ఇబ్బంది ఉన్నప్పుడు వారికి ముందుగానే అవగాహన కల్పించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది రోగులకు సేవాభావంతో సేవలందించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పిల్లలు పుట్టినప్పుడు తల్లి పాలు ఇచ్చేవిధానం, ఆరోగ్య లక్షణాలు, తదితర విషయాలను బాలింతలకు అవగాహన కల్పించాలని జిల్లా ఐసిడియస్ పిడిని జిల్లా కలెక్టరు ఆదేశించారు. జిల్లా ప్రధాన హాస్పిటల్ లో పుట్టిన శిశువులకు తగు జాగ్రత్తలు, వైద్యసేవలు అందించుటకు అవసరమైన అధునాతన వైద్య పరికరాలు పై నివేదిక అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని జిల్లా కలెక్టరు ఆదేశించారు. నెలలు నిండని ప్రసవం కేసులపై వైద్యులు అధ్యయనం చెయ్యాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గత సంవత్సరం సంభవించిన 3 మాతృ మరణాలు, 36 శిశు మరణాలపై కేసుల వారీగా కలెక్టర్ సంబంధిత వైద్యులతో సమీక్షించారు.
సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ ఎస్ డా. బి.పాల్ సతీష్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.యు.శోభ, ఐసిడిఎస్ పిడి పి.శారద, డెమో శ్రీనివాసరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి, ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రుల వైద్యులు, కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.