మార్చి 01వ తేదీ సెలవుదినం కనుక ఒక రోజు ముందుగానే లబ్ధిదారులు ఇంటింటికి వెళ్ళి పింఛన్ల సొమ్ము పంపిణీ.
ఏలూరు, ఫిబ్రవరి 28: స్థానిక 17వ డివిజన్ గాంధీ మైదాన ప్రాంతంలో శనివారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు ఇంటింటికి వెళ్ళి యోగక్షేమాలను, కుటుంబ సభ్యులు వివరాలను అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లబ్ధిదారులకు పింఛన్లు సొమ్మును అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మార్చి 01వ తేదీ ఆదివారం సెలవు దినం వలన ఒక్క రోజు ముందుగానే ఉదయం 7:00 గంటలు నుండి జిల్లా వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 2,57,658 మందికి రూ 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేసామన్నారు. ఇందుకు జిల్లాలో 5047 మంది వార్డు, గ్రామ సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందితో పింఛన్లు పంపిణీ పక్కా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని తెలిపారు. పింఛన్లు పొందేందుకు లబ్ధిదారులు వారి ఇండ్లలో అందుబాటులో ఉండేలా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ముందస్తు సమాచారం అందించామని తెలిపారు. సామాజిక పెన్షన్ల సొమ్మును భవిష్యత్తు అవసరాలు కోసం లబ్ధిదారులు ఖర్చులు పోను ఎంతో కొంత దాచుకోవాలని సూచించారు.
పెన్షన్ సొమ్ము నేరుగా ఇంటి వద్దనే అందించడం వల్ల వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిపొందుతున్నామని తెలిపారు. ఈ విధానం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
జిల్లా కలెక్టరు వెంట కెఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, మున్సిపల్ కమీషనరు ఏ.భాను ప్రతాప్, తహశీల్దారు కె.గాయత్రీదేవి, కార్పొరేటరు పాము శామ్యూల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.